వైసీపీ హర్ట్ : లోకేశా...గెలిచావ్ పో...?

Tue May 24 2022 05:00:02 GMT+0530 (IST)

TDP Leader Nara Lokesh

మొత్తానికి మూడేళ్ళుగా విపక్షంలో ఉంటూ చినబాబు ఏం సాధించారు అంటే వైసీపీని హర్ట్ చేసేటంతగా అని జవాబు వస్తుందేమో. వైసీపీ లోకేష్ ని ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. మినిష్టర్ గా చేసినా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కూడా ఈ రోజుకీ  చంద్రబాబు కొడుకుగానే చూస్తోంది. అయితే లోకేష్ మాత్రం మునుపటి కంటే దూకుడు పెంచారు. అయితే ట్విట్టర్ లేకపోతే మీడియా స్క్రోలింగ్ లో మాత్రమే  అనిపించుకునే లోకేష్ ఇపుడు జనాల్లోకి విరివిగా  వస్తున్నారు.ఏపీలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా లోకేష్ వచ్చి వాలుతున్నారు. తన మామ బాలయ్య సినిమా డైలాగులను కలిపి మాస్ మసాల ఎక్కేలా పంచుల మీద  పంచులు  విసురుతున్నారు. ఈ ఫ్లోలో ఆయన చాలానే పెద్ద మాటలు  అనేస్తున్నారు. నా వెంట్రుక కూడా పీకలేవు జగన్ అని సవాల్ చేస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే లోకేష్ భాష బాగా మార్చేశారు. వైసీపీ నేతలను లైట్ తీసుకుంటున్నారు. ఆ జోరులో ఆయన చాలా సార్లు నోరు జారేస్తున్నారు. ఏక వచన ప్రయోగాలు చేస్తున్నారు. దాంతోనే వైసీపీ నేతలు హర్ట్ అవుతున్నారు. విపక్ష నేతగా లోకేష్ ప్రభుత్వాన్ని విమర్శిచడం వరకూ ఒకే అనుకున్నా ఆయన ఇలా దిగజారి మాట్లాడడం ఏంటి అని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అవుతున్నారు.

లోకేష్ బొత్తిగా మర్యాద ఇవ్వకుండా ఏకవచనంగా వైసీపీ నేతల మీద మాట్లాడడం అసలు బాగా లేదు అని కూడా బొత్స ఫైర్ అవుతున్నారు. లోకేష్ కి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నారు అని కూడా బొత్స అంటున్నారు. ఆయన ప్రతీ దానికీ ఇలా మాట్లాడుతూ మా మీద విరుచుకుపడడమేంటి అని కూడా అంటున్నారు.

సరే అవన్నీ పక్కన పెడితే జస్ట్ లోకేష్ అని అంటున్న వైసీపీ నాయకులకు మంత్రులకు లోకేష్ తన ఉనికి ఏంటో బాగానే చూపించారు అని అంటున్నారు. ఆయన వైసీపీ నేతలను హర్ట్ చేయడం ద్వారా వారి హార్ట్ లోకి  డైరెక్ట్ గా దూసుకువచ్చేశారు అని కూడా అంటున్నారు. చంద్రబాబు తెల్లారి లేస్తే కామెంట్స్ చాలా చేస్తారు కానీ సీనియర్ పొలిటీషియన్ కాబట్టి హద్దులు దాటేందుకు చాలా  ఆలోచిస్తారు.

కానీ లోకేష్ మాత్రం చాలా ఈజీగా మాటలు విసిరేస్తున్నారు. దాంతో చంద్రబాబు కంటే కూడా లోకేష్ మాటలకే వైసీపీ నేతలు షాక్ తినే పరిస్థితి ఉంది అంటున్నారు. అందుకే బొత్స లాంటి వారు మాట జాగ్రత్త లోకేశా అని ఒకటికి పది మార్లు హెచ్చరించాల్సి వస్తోందిట. అయినా చినబాబు తగ్గుతాడా. అందునా వైసీపీ వారు తాము హర్ట్ అని అంటూంటే ఇంకా రెచ్చకుండా ఆగుతాడా. చూడాలి మరి.