కొల్లు రవీంద్రకు 14 రోజులు రిమాండ్ .. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలింపు !

Sat Jul 04 2020 18:30:18 GMT+0530 (IST)

TDP Leader Kollu Ravindra Sent To Rajahmundry Central Jail

మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు వైసీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ  అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజులపాటు  జుడీషియల్ రిమాండ్ విధించింది. దీనితో కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.మోకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి కొల్లు రవీంద్రను  తుని వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నసంగతి తెలిసిందే. తర్వాత  ఆయనను పెడన నియోజకవర్గం గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు పూర్తి చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవీంద్రను రెండో అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న  న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అయిదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అంతకంటే ముందు మీడియాతో మాట్లాడిన కృష్ణా జిల్లా ఎస్పీ ..  మోకా హత్య ప్లానింగ్ లో కొల్లు రవీంద్ర భాగస్వామేనని ఈ  ఘటన జరిగిన తర్వాత నిందితుల కాల్ డేటాను పరిశీలించాకే  రవీంద్రను అరెస్ట్ చేసి జడ్జ్ ముందు ప్రవేశపెట్టామన్నారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది  ముమ్మాటికీ ప్రతీకార చర్యే అంటూ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.