టీడీపీ లేడీ ఫైర్ బ్రాండ్లు దూరం.. ఏం జరుగుతోందంటే...!

Mon Aug 19 2019 18:48:44 GMT+0530 (IST)

TDP Lady Fired Brands Jumping into BJP!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత టీడీపీని ఒక్కరొక్కరుగా నాయకులు దూరం పెడుతున్నారు. తొలుత నలుగురు రాజ్యసభ సభ్యులతో ప్రారంభమైన ఈ జంపులు ఇప్పుడు లేడీ ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేసుకున్న అధికార ప్రతినిధులు కూడా దూరమవుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వాస్తవం ఎలా ఉన్నా..ఈ రూమర్లతో టీడీపీలో పెద్ద అలజడే చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్తే.. టీడీపీ తరఫున అధికార ప్రతినిధులుగా చాలా మందే ఉన్నారు. వారిలో మహిళలుగా ఉన్న పంచుమర్తి అనురాధ - యామినీ శర్మ - మాజీ నటి దివ్యవాణి.. పెద్ద ఎత్తున టీడీపీ తరఫున గళం వినిపించారు.ముఖ్యంగా వైసీపీలో ఫైర్ బ్రాండ్ రోజా వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు వీరు కౌంటర్లు ఇచ్చారు. చంద్రబాబును పార్టీని వైసీపీ తరఫున విమర్శించే నాయకులకు వీరు చెక్ పెడుతూ వచ్చారు.  ఎన్నికలకు ముందు చాలా యాక్టివ్‌గా ఉన్న మహిళా అధికార ప్రతినిధులు ఇటు రెగ్యులర్ మీడియా సహా సోషల్ మీడియాలో నూ దుమ్ము రేపారు. నిత్యం ఏవో కామెంట్లతో వారు ప్రజల ముందుకు వచ్చే వారు. మళ్లీ అధికారం చంద్రబాబుదేనని చెప్పారు. ప్రచారంలో పాల్గొనక పోయినా. సోషల్ మీడియా ప్రచారంలో బాగానే పాలు పంచుకున్నారు.

ఇక యామినీ శర్మ పంచుమర్తిలు వివిధ టీవీ చానెళ్లు నిర్వహించిన చర్చా వేదికల్లోనూ మెరిసారు. బాబు తరఫున పార్టీ తరఫున కూడా తమ వాగ్దాటిని వినిపించారు. అయితే తాజాగా యామినీ శర్మ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారంటూ.. ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనంగా మారింది. వచ్చే ఐదేళ్ల వరకు టీడీపీలో పని లేక పోవడంతో వీరు ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏముంటుందని భావిస్తున్నారని అందుకే పార్టీ మారేందుకు చూస్తున్నారని అంటున్నారు.

సామాజిక వర్గం పరంగా చూసుకున్నా బ్రాహ్మిన్ అయిన యామినీ శర్మకు బీజేపీ అయితే బాగుంటుందనే సూచనలు కూడా రావడం కుటుంబం కూడా ఆమెను బీజేపీవైపు మొగ్గు చూపేలా ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. నిజానికి ఆమెకు బాగానే ఫాలోయింగ్ కూడా ఉంది. చిన్నబాబు లోకేష్‌పై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంలో ఆమె చురుగ్గానే ఉన్నారు. దీంతో ఈమె వల్ల బీజేపీకి కొంతలో కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా దివ్వవాణి కూడా బీజేపీవైపు చూస్తున్నారని సమాచారం.

ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందుమాత్రమే టీడీపీ తీర్థం పుచ్చుకున్న దివ్యవాణి.. అధికార ప్రతినిధిగా వాణి వినిపించారు. అయితే ఆమె సోషల్ మీడియాలో పెద్దగా కనిపించక పోయినా.. మెయిన్ మీడియాలో అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు చేసి గుర్తింపు పొందారు. అయితే ఈమెకూడా ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారని అంటున్నారు. ఇక పంచుమర్తి అనురాధ మాత్రం మౌనంగా ఉన్నారు. ఆమెకు పార్టీ అధినేతపై తీవ్ర అంసతృప్తి ఉంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని ఆశించారు. అయితే బాబు దీనిని ఏకంగా తన కుమారుడికి ఇచ్చుకోవడంతో మౌనం వహించారు. మరి ఇప్పుడు మౌనంగా ఉన్నా.. ఆమెకూడా ఏదో ఒక పార్టీని చూసుకుంటారనే ప్రచారం మాత్రం తెరమీదికి వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. ఓటమితో అల్లాడుతున్న పార్టీకి.. వీరు కూడా హ్యాండిస్తే.. మహిళా ప్రతినిధులను బాబు వెతుక్కోక తప్పదని అంటున్నారు పరిశీలకులు.