ఆ సీటు పై కన్నేశారా...కుప్పం సంగతేంటి...?

Sun Sep 25 2022 14:59:57 GMT+0530 (India Standard Time)

TDP In Kuppam

ఏపీలో కుప్పం అన్న సీటు ఉందన్న సంగతి గత మూడేళ్ళుగానే జనాలకు తెలిసింది. ఎందుకంటే ఏపీలో ఈ సీటు ఉన్నా కూడా అక్కడ వారికి ఏపీ రాజకీయం తెలియదు అలాగే కుప్పం కూడా మూలన విసిరేసినట్లుగా ఉంటుంది. పైగా కుప్పం  తమిళనాడు కర్నాటక సరిహద్దుల్లో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మూడు రాష్ట్రాల ముద్దుబిడ్డ కుప్పం అని భావించాలి. అయితే  ఇక్కడ జనాలు తమిళ వాసనతతో పాటు కన్నడ కల్చర్ తోనూ కనిపిస్తారు.కుప్పం వాసులలో అత్యధికులు వర్తమాన రాజకీయాల పట్ల పెద్దగా అవగహానతో ఉండరని అంటారు. వారు తమ పనేంటో తామేంటో అన్నట్లుగానే ఉంటారు. ఇక్కడ మరో చిత్రం కూడా చెప్పాలి. కుప్పానికి చంద్రబాబు ఏడుసార్లు ఎమ్మెల్యే కదా. ఆయన ఫోటో తీసుకెళ్ళి చాలా గ్రామాల్లో చూపిస్తే తెలియదు అని చెప్పేవారు కూడా ఎక్కువగా ఉన్నారట. అంటే తాము ఎందుకు ఓటేస్తున్నామో ఎవరికి ఓటేస్తున్నామో కూడా తెలియనంత అమాయకమైన స్థితిలో వారు ఉన్నారని చెబుతారు.

అయితే ఇదంతా గతం. ఇపుడు అక్కద మార్పు వచ్చింది. దానికి నిదర్శనమే లోకల్ బాడీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది. మరి ఇంతకాలం సైకిల్ గుర్తుకు వేసిన ఆ చేతులు ఫ్యాన్ గుర్తు వైపు మళ్ళాయి. అలా ఎందుకు జరిగింది అంటే దానికి వారికి పెరిగిన చైతన్యమా లేక మరోటా అంటే అది కొంతమేరకు నిజం. దానికంటే ముందు అక్కడ టీడీపీకి ధీటుగా రెండవ పార్టీగా వైసీపీ నిలబడింది. ఆ పార్టీ కూడా తన మార్క్ పాలిటిక్స్ ని అక్కడ చూపిస్తోంది. దాంతో కుప్పంలో పెను మార్పులు వస్తున్నాయి.

ఇవన్నీ ఎలా ఉన్నా కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదల అయితే వైసీపీలో ఉంది. దాంతో జగన్ ఫుల్ ఫోకస్ అక్కడ పెట్టారు. దానికి లోకల్ క్యాండిడేట్ భరత్ మీకు ఉన్నారని ఆయన బీసీ అని చెబుతున్నారు. అంతే కాక ఆయన్ని గెలిపిస్తే మంత్రిని చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. ఇక కుప్పంలో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. అక్కడ అభివృద్ధి మీద కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది.

దాంతో టీడీపీకి ఓటమి లభిస్తుందా అంటే చెప్పలేరు కానీ గట్టి పోటీ అయితే వైసీపీ నుంచి ఉంది అని అంటున్నారు. అయితే రాజకీయాలో ఏమి జరుగుతుందో కూడా చెప్పలేరు. ఎన్టీయార్ ఇందిరా గాంధీ చిరంజీవి లాంటి వారే ఓడారు కాబట్టి టీడీపీ కూడా జాగ్రత్తగా కుప్పంలో మారుతున్న పరిణామాలను గమనిస్తోంది. బాబు ఇంతదాకా తన మనుషులను అక్కడ పెట్టింది తాను జస్ట్ పర్యవేక్షణ చేసేవారు.

ఇపుడు ప్రతీ రెండు నెలలకు ఆయన కుప్పానికి వెళ్తున్నారు. అదే విధంగా అక్కడ జనాలతో నేరుగా మమేకం అవుతున్నారు. పనిచేయని వెన్నుపోటు పొడుస్తున్న టీడీపీ నేతలకు స్వస్తి పలికి నమ్మకం కలిగిన వారినే నియమించుకున్నారు. కుప్పంలో టీడీపీ ఆఫీస్ ఇపుడు చురుకుగా పనిచేస్తోంది. బాబు తాను ఇల్లు కట్టుకుంటాను అని చెప్పారు. ఇవన్నీ ఆయన తానుగా చేసుకుంటున్న రిపేర్లు.

అయితే ఎంత చేసినా కుప్పంలో కొంత కలవరం అయితే టీడీపీకి ఉందిట. అందుకే సేఫ్ సైడ్ గా రెండవ సీటు ఒకటి చూసుకోవాలని టీడీపీ భావిస్తోంది. అదే అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గం సీటు. ఈ సీట్లో బీసీలు ఎక్కువగా ఉంటారు. గతంలో ఈ సీటు టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో ఉషా చరణ్ ఇక్కడ నుంచి గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.

ఈ సీటు టీడీపీకి ఎంత బలమైనది అంటే 1983 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో అయిదు సార్లు గెలిచింది. మధ్యలో ఒకటి రెండు సార్లు కాంగ్రెస్ గెలిచినా టీడీపీకి బలముంది. 2014లో హనుమంతరాయ చౌదరి ఇక్కడ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా కమ్మవారికే ఈ సీటుని టీడీపీ ఇచ్చింది. అలా మాదినేని ఉమామహేశ్వరనాయుడు పోటీ చేసి 68 వేల పై చిలుకు  దాకా ఓట్లు తెచ్చుకున్నారు. ఇపుడు ఈ సీటు నుంచి చంద్రబాబు పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన ఉషాకిరణ్ పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా కోలుకోలేదు. దాంతో బాబు పోటీ చేస్తే వార్ వన్ సైడ్ అవుతుందని ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం టీడీపీ విజయానికి అది దోహదపడుతుందని అంచనా వేస్తున్నారుట. చూడాలి మరి కుప్పం టూ కళ్యాణదుర్గం బాబు పొలిటికల్ చేంజ్ ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో అన్నది.