తెలుగుదేశం పార్టీ.. పిల్ దాఖలు చేయబోతోందా?

Thu Oct 10 2019 17:00:23 GMT+0530 (IST)

TDP Files on Petition Against gram panchayat secretary Recruitment In Andhra

గ్రామ సచివాలయం జాబ్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం ఇప్పటితో ఆగేలా లేదు. ఆ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని అంటూ తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఆ ఆరోపణల్లో ఇప్పటి వరకూ పెద్దగా పస కనిపించలేదు. ఏదో టీడీపీ అనుకూల మీడియా హడావుడి చేయడమే తప్ప అంతకు మించి సీనేమీ లేదు.అయితే ఆ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ వాళ్ల మాటలు మాత్రం ఆగడం లేదు. దాన్ని తాము ఇంకా వదలలేదని ఆ పార్టీ వారు కొందరు అంటున్నారు. టీవీ చానళ్ల డిస్కషన్లలో వారు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆ వ్యవహారంపై కోర్టుకు వెళ్లబోతోందట!

ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయబోతోందట. ఆ పరీక్షలు రాసి ఉద్యోగం పొందలేని వారి సంతకాల సేకరణ చేసి.. పిల్ ను దాఖలు చేయబోతున్నట్టుగా టీడీపీ ప్రతినిధి ఒకరు ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. మరి నిజంగా తెలుగుదేశం ఆ పని చేస్తుందేమో చూడాల్సి ఉంది.

ఒకవేళ ఆ పని చేయాలంటే పక్కా ఆధారాలను చూపాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీనే అభాసుపాలవుతుంది. అందులోనూ ఏకంగా లక్ష మందికి పైగా ఆ ఉద్యోగాలను పొందారు. అలాంటి  వారి ఆగ్రహానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గురి అవుతూ ఉంది. ఆ పరీక్షను నిజాయితీతో రాసి - కష్టపడి చదివి ఉద్యోగాలను పొందిన వారు టీడీపీ వైఖరి మీద ఫైర్ అవుతున్నారు.

అయితే పరీక్ష తప్పి - ఉద్యోగం పొందలేని కొంతమంది కొన్ని సాకులు చెప్పవచ్చు. ఆ కుంటి సాకులు చెప్పేవారు తెలుగుదేశం పార్టీ వాదనకు అనుగుణంగా మాట్లాడవచ్చు. కానీ కోర్టులో మాటలతో చెల్లుబాటు కాదు - సాక్ష్యాల అవసరమే ఉంటుంది. తెలుగుదేశం వాటిని చూపించలేకపోతే  పోయేది ఆ పార్టీ పరువే!