Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ... నీకు అర్ధ‌మ‌వుతుందా? : టీడీపీ ఫ్యాన్స్ టాక్

By:  Tupaki Desk   |   3 May 2021 12:30 PM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ... నీకు అర్ధ‌మ‌వుతుందా? :  టీడీపీ ఫ్యాన్స్ టాక్
X
ప్ర‌స్తుతం వ‌చ్చిన తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నిక ఫ‌లితంలో వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి విజ‌య‌ఢంకా మోగించారు. రాజ‌కీ యాల‌కు కొత్తే అయినా.. పోటీలో తొలిసారి నిల‌బ‌డినా.. అత్యంత కీల‌కమైన స్థానంలో పోటీ చేసినా.. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకు న్నారు. నిజానికి ఇక్క‌డ వైసీపీ విజ‌యం ఎన్నిక‌ల‌కు ముందుగానే ఖ‌రారైంది. అయితే.. ఎటొచ్చీ.. మెజారిటీపైనే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. స‌రే! ఈ మొత్తం వ్య‌వ‌హారంలో బీజేపీ-జ‌న‌సేన కూట‌మిది ప్ర‌ధాన పాత్ర‌. ప‌ట్టుబ‌ట్టి.. ఇక్క‌డ టికెట్ సంపాయించుకున్న బీజేపీ.. మాజీ ఐఏఎస్ అధికారి ర‌త్న‌ప్ర‌భ‌ను రంగంలోకి దించింది.

టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2 లక్షల 71 వేల 391 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలిచారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 6 లక్షల 25 వేల 820 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,54,253 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 57 వేల 070 ఓట్లు వచ్చాయి. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి గురుమూర్తి ఆధిక్యంలోనే కొనసాగారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి భారీ మెజార్టీతో పనబా కపై గురుమూర్తి గెలుపొందారు. ఈ తాజా విజయంతో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, స్థానిక నేతలు సంబరాలు జరుపుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 7,22,877, టీడీపీకి 4,94,501 ఓట్లు వచ్చాయి.

ఇక‌, ఇదే ఎన్నిక‌ల్లో 2019లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన బొమ్మి శ్రీహ‌రిరావు.. కేవ‌లం 16,125 ఓట్లు సంపాయించుకున్నా రు. ఇప్పుడు ర‌త్న ప్ర‌భ 57,070 ఓట్లు ద‌క్కించుకున్నారు., అయిన‌ప్ప‌టికీ.. డిపాజిట్ కోల్పోయారు. అయితే.. ఈ మాత్రం ఓట్ల‌యినా.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌చారంతోనే ఇక్క‌డ బీజేపీకి ప‌డ్డాయ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు.. ప‌వ‌న్‌.. ఇక‌, బీజేపీతో ఏమేర‌కు కొన‌సాగుతారు? త‌న పొత్తునుఎలా కొన‌సాగిస్తారు? అనేది ఆస‌క్తిగా ఉంది. ఆయ‌న వ‌ల్ల బీజేపీకి ప్ర‌యోజ‌నం ఉంద‌ని. బీజేపీ వ‌ల్ల ప‌వ‌న్‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌నే విష‌యం.. తాజా ఎన్నిక‌లలోనూ స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, టీడీపీ ఫ్యాన్స్‌.. మ‌రో కీల‌క‌.. వాద‌న‌ను తెర‌మీదికి తెస్తున్నారు. బీజేపీ క‌న్నా.. ప‌వ‌న్.. టీడీపీతో క‌లిసి ముందుకు సాగితే.. భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని చెబుతున్నారు. సంస్థాగ‌తంగా ఉన్న ఓటు బ్యాంకును టీడీపీతోపాటు పవ‌న్ కూడా స‌ద్వినియోగం చేసుకునే అవ‌కాశం ఉంటుందని చెబుతున్నారు. ఏమాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీతో జ‌ట్టుక‌ట్టి.. అన్ని విధాలా అభాసు పాలు కావ‌డం.. కంటే.. ప‌వ‌న్‌కు ఈ మ‌ధ్య కాలంంలో ద‌క్కిన ప‌ర‌ప‌తి ఏమీ క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్‌-టీడీపీ జ‌ట్టు క‌డితే.. రాష్ట్రంలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగానే కాకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి .. వైసీపీకి చెక్ పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొంటున్నారు.

అలా కాకుండా.. ఇప్పుడున్న విధంగానే క‌మ‌ల నాథుల‌తో వ్యూహాత్మ‌క పొత్తును కొన‌సాగిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పుకొంటూ.. పోతే.. ఇప్పుడు బీజేపీకి వ‌చ్చిన ఫ‌లితం క‌న్నా.. మెరుగైన ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం మున్ముందు కూడా లేద‌ని.. ప‌వ‌న్ ఇప్ప‌టికైనా అర్ధం చేసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల కుముందు జ‌రిగిన ఈక్వేష‌న్ మ‌రోసారి తెర‌మీదికి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది. అధికారంలోకి వ‌చ్చేస్తామ‌న్న బెంగాల్‌లో చ‌తికిల ప‌డ‌డం, కేర‌ళ‌లో ఉన్న ఒక్క సీటును కూడా ద‌క్కించుకోలేక పోవ‌డం, త‌మిళ‌నాట అధికార పార్టీ గెలుపున‌కు గండికొట్ట‌డంలో బీజేపీ పాత్ర ఉండ‌డం వంటి ప‌రిణామాల‌ను గుర్తిస్తే.. బీజేపీకి రానున్న ఫ్యూచ‌ర్‌లో ఎడ్జ్ లేద‌ని.. ఇప్ప‌టికైనా ప‌వ‌న్ గుర్తించి... `స‌రైన నిర్ణ‌యం` తీసుకుంటే మేల‌ని.. చెబుతున్నారు. మ‌రి టీడీపీ ఫ్యాన్స్ ఆలోచ‌న ప‌వ‌న్‌కు ఏమేర‌కు చేరుతుందో చూడాలి.