Begin typing your search above and press return to search.

టీడీపీ సంబడం కానీ బీజేపీ మింగేయదు కదా...?

By:  Tupaki Desk   |   30 Aug 2022 12:30 AM GMT
టీడీపీ సంబడం కానీ బీజేపీ మింగేయదు కదా...?
X
ఏపీలో అర్జంటుగా ఎదగాలని బీజేపీ అనుకుంటోంది. అయితే ఆ పార్టీకి సొంత బలం ఎంత అంటే నోటా కంటే తక్కువ అని 2019 ఎన్నికల ఫలితాలు తేల్చాయి. రేపటి ఎన్నికల్లో కూడా పెరిగితే ఒకటి రెండు శాతం పెరగవచ్చు. మరి ఏపీలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి. తెలంగాణాలో అయితే బీజేపీ 2023లో ముఖ్యమంత్రి సీటు పట్టాలని ఒక భారీ ప్లాన్ వేసుకుని ముందుకు సాగుతోంది. అక్కడ బీజేపీకి ఎంతో కొంత బలం ఉంది. నాయకులు క్యాడరూ కూడా ఉన్నాయి.

కానీ ఏపీలో సీన్ చూస్తే అలా కాదు కాదా. కనీసంగా కూడా పార్టీ బలం లేదుగా. అయితే ఇక్కడే బీజేపీ ఈశాన్య రాష్ట్రాలలో చేసిన ఆపరేషన్ లాంటిది చేయబోతోంది అని అంటున్నారు. అది అరుణాచలప్రదేశ్ లా ఉండొచ్చు, లేక మణిపూర్ లాగ కూడా ఉండొచ్చు. ఇక అస్సాం లాంటి ప్లాన్ అయినా అవవచ్చు. ఈ మూడూ ఎందుకు అంటే ఇక్కడ నికరంగా బీజేపీకి ఏ రోజూ బలం లేదు. కానీ బలంగా ఉన్న ప్రత్యర్ధులను లాగేసి తనలో కలిపేసుకుని బీజేపీ బలపడింది.

అలా ఇపుడు అక్కడ రాజ్యాధికారం అందుకుంది. ఏపీలో బీజేపీ మెల్లగా అడుగులు వేస్తూ పోతే ఈ శతాబ్దం పూర్తి అయినా పవర్ లోకి వచ్చే చాన్స్ అయితే లేదు. అదే అక్కడ మరో పార్టీని కబలించేసినా మింగేసినా తాను పూర్తిగా బలంగా మారిపోవడం ఖాయం. అలా కనుక చూసుకుంటే ఏపీలో బీజేపీకి పచ్చ పచ్చని పండులా టీడీపీ కనిపిస్తోంది అని అంటున్నారు. వైసీపీ అయితే ఓటు బ్యాంక్ పూర్తిగా యాంటీగా ఉంటుంది. అది వర్కౌట్ అవదని అంటున్నారు.

అందుకే బీజేపీ టీడీపీకి కన్ను కొడుతోంది అని కూడా అంటున్నారు. నిజానికి 2019 ఎన్నికల‌లో చంద్రబాబు మోడీ దిగిపోవాలి అని దేశమంతా ప్రచారం చేశారు. తెగ తిరిగారు. దేశంలోని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలకు ఆర్ధికంగా ఇతరత్రా సాయం చేశారని కూడా బీజేపీకి అనుమానాలేంటి ఆధారాలు ఉన్నాయని అంటారు.

ఇక మోడీ అమిత్ షాల విషయం తీసుకుంటే వారు తమకు ఏ మాత్రం అపకారం చేసిన వారినైనా ఎపుడూ మరచిపోరు. సొంత పార్టీ నేతలు కూడా అందుకు మినహాయింపు కానే కాదు. నితిన్ గడ్కరీ అనే పెద్దాయన పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు తమ మాట వినలేదని ఇన్నేళ్ళ తరువాత కూడా చుక్కలు చూపించిన బీజేపీ పెద్దలకు బాబును క్షమించేసేటంత పరిస్థితి ఉంటుందని ఎవరూ అనుకోరు.

దాంతో టీడీపీ బీజేపీతో కలసి పెత్తు పెట్టుకుని 2024లో గెలిచేద్దామని సంబడం పడుతోంది కానీ బీజేపీ మాత్రం టీడీపీని వీలైతే పూర్తిగా కాకుంటే సగానికైనా మింగేయాలని ప్లాన్ వేస్తోందని అంటున్నారు. చంద్రబాబుకు మళ్లీ ఊపిరి పోసి టీడీపీ వారసత్వ కధను ఆయన మనవడు దేవాన్ష్ దాకా తీసుకెళ్ళాలన్న ఉదాతర్వం బీజేపీకి ఎందుకు ఉంటుంది అని అంటున్నారు.

టీడీపీ ఇప్పటికే బక్కచిక్కి ఉంది. గ్రాఫ్ అయితే ఎక్కడా లేవడంలేదు. ఆ పార్టీని ఆశ్రయించి ఉన్న బలమైన సామాజికవర్గం కమ్మ వారికి ఏమీ తోచడంలేదు, జగన్ అయితే టీడీపీ మీద పగ పట్టినట్లుగా ఉన్నారు. దాంతో ఇపుడు బీజేపీ ప్లాన్స్ ఫలించే చాన్స్ ఉందని అంటున్నారు. నమ్ముకున్న బాబు రాజకీయంగా రుజువు చేసుకోకపోతే కమ్మలు అయినా బీజేపీ లాంటి పార్టీని ఆశ్రయిస్తారన్నదే కమలం పార్టీ ఆలోచన.

ఇక టీడీపీలో బిగ్ షాట్స్ ని కూడా తట్టిలేపి తమ వైపునకు తిప్పుకోవాలని మరో ప్లాన్. ఇంకో వైపు పురంధేశ్వరి లాంటి వారి ఆసరాతో బంధుత్వాన్ని టచ్ చేసి టీడీపీలో కలి పుట్టించాలన్న ప్లానూ ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీని వీక్ చేయడమే ఇపుడు బీజేపీ పధకమని అంటున్నారు. చంద్రబాబు ఏజ్ ఫ్యాక్టర్ ని లోకేష్ అనుభవ లేమిని ఆసరాగా చేసుకుని ఏపీలో బీజేపీని టీడీపీలో ప్లేస్ లో నిలపాలన్నదే ఎత్తుగడ. అందుకే అమరావతి ఉద్యమాన్ని తమ తలకెత్తుకున్నారని అంటున్నారు.

ఏపీలో వైసీపీకి తామే ఆల్టర్నేషన్ అని చాటి చెబుతూనే టీడీపీకి పొగపెట్టడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీని మరోమారు ఏలాలన్న బాబు ఆలోచనలు అయితే పూర్తి సంప్రదాయంగా ఉన్నాయి. కానీ మహారాష్ట్ర పరిణామాల‌ తరువాత చూస్తే కనుక బీజేపీ ఏమైనా చేస్తుంది అన్నది అందరికీ అర్ధమవుతున్న విషయం. అయితే ఆపరేషన్ టీడీపీ వార్తలు బాగానే ప్రచారంలో ఉన్నాయి మరి.