Begin typing your search above and press return to search.

టీ-20 వరల్డ్ కప్ : పాక్ కు సింహస్వప్నం విరాట్.. రికార్డ్స్ ఇవే !

By:  Tupaki Desk   |   23 Oct 2021 1:30 AM GMT
టీ-20 వరల్డ్ కప్ : పాక్ కు సింహస్వప్నం విరాట్..  రికార్డ్స్ ఇవే !
X
ప్రస్తుతం టీమిండియా.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో టీ -20 వరల్డ్ కప్ 2021 ఆడుతోంది. ఈ మెగా టోర్నీ తర్వాత, కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. ఇప్పటికే ఈ విషయమై కోహ్లీ ప్రకటన కూడా చేశాడు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ, టీమిండియా కెప్టెన్‌ గా కూడా తప్పుకోనున్నాడు. దీంతో కెప్టెన్ గా ఆఖరి ధనాధన్ టోర్నీలో రెచ్చిపోవాలని విరాట్ కోహ్లీ మంచి కసితో ఉన్నాడు.

రెండు టీ-20 వరల్డ్ కప్ టోర్నీల్లో 100+ సగటుతో పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. 2014 టీ20 వరల్డ్‌ కప్‌ లో 106.33 సగటుతో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2016లో 136.50 సగటుతో పరుగులు సాధించాడు. ఇక, టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో పాకిస్తాన్‌ పై అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్ కూడా విరాట్ కోహ్లీయే. పాక్‌ పై విరాట్ 169 పరుగులు చేయగా, గౌతమ్ గంభీర్ 75, రోహిత్ శర్మ 64 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో పాకిస్తాన్‌ తో జరిగిన మ్యాచుల్లో 2012లో 78, 2014లో 36, 2016లో 55 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు విరాట్ కోహ్లీని, ఇప్పటిదాకా టీ20 వరల్డ్‌ కప్‌ లో పాక్ బౌలర్లు, విరాట్‌ ను ఔట్ చేయలేకపోయారంటే అర్ధం చేసుకోవచ్చు, కోహ్లీ వాళ్ల మీద ఎలా ఆధిపత్యం చెలాయించాడో. టీ20 వరల్డ్‌ కప్ లో 11 సార్లు 30 స్కోర్లు చేశాడు విరాట్ కోహ్లీ. మరో నాలుగు సార్లు ఆ స్కోరు చేస్తే అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన ప్లేయర్‌ గా రికార్డు క్రియేట్ చేస్తాడు. శ్రీలంక మాజీ క్రికెటర్లు దిల్షాన్, జయవర్థనే 14 సార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌ లో ఉన్నారు.

ఇదేకాకుండా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు 200కి పైగా పరుగులు చేసిన ప్రతీసారీ విక్టరీ కొట్టింది. 8సార్లు 200+ పరుగుల స్కోరుని కాపాడుకుంటూ మ్యాచ్ గెలిచిన విరాట్ సేన, రెండు మ్యాచుల్లో ఈ లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంది. ఇక, మెగా టోర్నీలో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసి జట్టును గెలిపించిన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీయే. టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ 50+ స్కోరు చేసిన ఏడు మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించగా, క్రిస్ గేల్ 6, జయవర్థనే, రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ ఐదేసి సార్లు ఈ ఫీట్ సాధించారు. టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన భారత ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే. టీమిండియా కెప్టెన్ స్ట్రైక్ రేట్ 133+ గా ఉండగా, సురేష్ రైనా 130.1, యువరాజ్ సింగ్ 128.9, రోహిత్ శర్మ 127.2 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశారు.