నేటి నుండి హైదరాబాద్ లో స్విగ్గి ఫుడ్ డెలివరీ బాయ్స్ సమ్మె

Mon Nov 29 2021 12:05:35 GMT+0530 (IST)

Swiggy boys strike in Hyderabad from today

ఏ సమయంలో అయినా.. ఎక్కడ నుంచి ఆర్డర్ చేసినా.. స్వల్ప వ్యవధిలో ఆహారాన్ని తీసుకువచ్చి.. కస్టమర్ల ఆకలి తీర్చే.. స్విగ్గి ఫుడ్ డెలివరీ బాయ్స్.. అంటే.. అందరికీ సానుభూతి ఉంది. ట్రాఫిక్ చిక్కులను కూడా ఎదుర్కొని.. రికార్డు సమయంలో డెలివరీ పూర్తి చేస్తారు.అయితే.. ఇప్పుడు వీరే.. సమ్మె గళం వినిపిస్తున్నారు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ.. హైదరాబాద్‌లోని స్విగ్గీ డెలివరీ బోయ్స్.. సోమవారం(నేటి నుంచి) నుంచి సమ్మె బాట పడుతున్నారు. తమ శ్రమ దోపిడీకి చెక్ పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోధరలు నిత్యావసరాల ధరలు పెరిగినా.. తమకు ఇచ్చే పేమెంట్లుతగ్గించడం.. దూరాలు పెంచడం దారుణమని ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఏం జరిగింది?

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ పరిస్థితి ఇటీవలి వరకు బాగానే ఉంది. డెలివరీ చార్జీ కింద 5 రూపాయలు వెయిటింగ్ చెల్లింపుతో 4.2 కిలోమీటర్ల పరిధి వరకు ఒక ఆర్డర్‌కు కనీస మొత్తం కింద 35 రూపాయలు చెల్లించేవారు. ఇక బ్యాచ్ ఆర్డర్ అంటే.. 1.6 కిలో మీటర్ల పరిధి వరకు 20 రూపాయలు ఇచ్చేవారు. దీనికి మించి అదనపు దూరం వళ్లి డెలివరీ చేయాల్సి వస్తే.. కిలోమీటరుకు 8 రూపాయల నుంచి 12 రూపాయలు అదనంగా ఇచ్చేవారు.

వీటితో పాటు.. ప్రతి నెలా.. ప్రోత్సాహకం(ఇన్సెంటివ్) కింద ప్రతి బోయ్‌కి రూ.4000 చెల్లించేవారు. దీంతో బోయ్స్ హ్యాపీగా ఉండేవారు. దీనికి మరో కారణం కూడా ఉంది. ఈ చెల్లింపులు చేసినప్పుడు.. పెట్రోల్ ధర లీటరు 70 రూపాయలే. పైగా.. సూపర్ జోన్లు ఉండేవి కావు. పైగా.. ఎంత దూరమైనా.. 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉండేది. దీంతో ఒకింత ఆదాయం కనిపించేది.

ఇప్పుడు ఏం జరిగింది?

డెలివరీ బోయ్స్ ఇస్తున్న పేమెంట్స్ తగ్గించారు. గతంలో 10 కిలో మీటర్లే ఉన్న పరిధి.. ఇప్పుడు 40 కిలో మీటర్లకు పెంచారు. అదేసమయంలో అదనపు జోన్టను కలిపారు. అంతేకాదు.. ఇప్పుడు ఆర్డర్‌కి 10 రూపాయలు 1.6 కిలో మీటర్లు వరకు అదనంగా ప్రయాణం చేసిన దానికి రూ.6 చొప్పున ఇస్తున్నారు. మిగిలిన సొమ్మును ఇవ్వడం లేదు. దీంతో ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలకు.. డెలివరీ చేసేందుకు ప్రయాణిస్తున్న దూరం పెరిగినప్పటికీ.. ఇస్తున్న సొమ్ముకు పొంతన ఉండడం లేదు. గతంలో 150 రూపాయల పెట్రోల్ పోయిస్తే.. రూ.1500 సంపాయించేవారు.

ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధర(లీటరు రూ.110)తో రోజుకు 400 రూపాయల పెట్రోల్ పోయిస్తే.. రూ.1100 చేయలేకపోతున్నారు. గతంలో కంటేఇప్పుడు దూరం పెరిగి ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తోంది. అయినా.. ఆదాయం కనిపించడంలేదు.

స్విగ్గీ బోయ్స్.. డిమాండ్లు ఇవే!
+ గతంలో ఇచ్చినట్టుగా పేమెంట్లు ఇవ్వాలి
+ కనీస బేస్ పే రూ.35 చెల్లించాలి
+ డెలివరీ చార్జీ రూ.5 ఇవ్వాలి
+ దూర ప్రయాణానికి కిలోమీటరుకు రూ.12 ఇవ్వాలి
+ నెలనెలా ఇంన్సెంటివ్ రూ.4000 ఇవ్వాలి
+ ప్రస్తుతం అమల్లో ఉన్న సూపర్ జోన్లు తొలగించాలి
+ థర్డ్ పార్టీలను తొలగించాలి(షాడో ఫ్యాక్స్&రాపిడో)