Begin typing your search above and press return to search.

ఏపీ దిశ చట్టంపై ప్రధానికి 'ఆమె' లేఖ

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:37 AM GMT
ఏపీ దిశ చట్టంపై ప్రధానికి ఆమె లేఖ
X
మహిళలపై అత్యాచారాలు.. అఘాయిత్యాలు.. దారుణ నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన చర్యలు తీసుకోవటం.. కఠిన శిక్షలు అమలు చేసేలా ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ దిశ చట్టాన్ని తీసుకురావటంపై తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సనర్ స్వాతి మాలీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. మహిళలపై అత్యాచారాలు.. దారుణ నేరాలకు పాల్పడే వారి విషయంలో సత్వరమే కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తో ఢిల్లీలో ఆమె దీక్ష చేపట్టారు. గడిచిన 12 రోజులుగా ఆమె దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తీసుకొచ్చిన చట్టం గురించి ప్రధాని మోడీకి లేఖ రాస్తూ.. దేశ వ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

దేశంలో మహిళల నుంచి పసిపిల్లలపై వేధింపులతో పాటు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ దిశ చట్టంలో భాగంగా ఇండియన్ పీనల్ కోడ్.. పోస్కో యాక్ట్.. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కు పలు సవరణల్ని చేసింది. ఈ మార్పుల్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఏపీ సర్కారు తెచ్చిన దిశ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసే వరకు తాను దీక్షను విరమించనని ప్రధాని మోడీకి రాసిన లేఖలో స్వాతి పేర్కొన్నారు.