హైకోర్టులో పరిపూర్ణానందకు చుక్కెదురు!

Wed Jul 11 2018 19:03:55 GMT+0530 (IST)

రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ను హైదరాబాద్ నుంచి 6 నెలల పాటు బహిష్కరించిన విషయం విదితమే. ఆ తర్వాత నేడు తెల్లవారుఝామున శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిపై కూడా తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ విధించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను ఖండిస్తూ పలు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు పరిపూర్ణానంద బహిష్కరణను కత్తి మహేష్ కూడా ఖండించారు. ఈ నేపథ్యంలో తన బహిష్కరణకు నిరసనగా పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. తనపై బహిష్కరించిన తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ధాఖలు చేశారు.తనపై విధించిన బహిష్కరణను పరిపూర్ణానంద సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తనను బహిష్కరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛను - రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీస్ శాఖ విస్మరిస్తోందని  పిటిషన్ లో పేర్కొన్నారు. తక్షణమే తనపై విధించిన నగర బహిష్కరణను తొలగించేలా పోలీస్ శాఖకు అదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించలేదు. కత్తి మహేష్ తో పాటు పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించడంపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వస్తున్నాయి. ఇలా బహిష్కరించుకుంటూ పోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పరిపూర్ణానంద పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారన్న విషయం ఆసక్తికరంగా మారింది.