కరోనాతో మోదీ తమ్ముడు మృతి!

Sun May 02 2021 20:53:10 GMT+0530 (IST)

 Sushil Kumar Modi younger brother dies with Corona

దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. వారూ వీరూ అనే తేడా లేకుండా అందరినీ బలితీసుకుంటోంది. తాజాగా.. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కుటుంబంలో విషాదం నింపిందీ మహమ్మారి. కొవిడ్ కారణంగా ఆయన తమ్ముడు అశోక్ కుమార్ మోదీ ప్రాణాలు కోల్పోయారు.కొన్ని రోజుల క్రితం కొవిడ్ బారిన పడిన అశోక్ కుమార్.. పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 65 సంవత్సరాలు.

ఈ మేరకు సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘‘నా చిన్న తమ్ముడు అశోక్ కుమార్ మోడీ కొవిడ్-19 కారణంగా కన్నుమూశారు. అతన్ని బతికించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’’ అని సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు.

కాగా.. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒక రోజు నమోదయ్యే కేసుల సంఖ్య ఏకంగా 4 లక్షలు దాటిపోయింది. దీంతో.. పరిస్థితి చేయి దాటిపోతోందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.