Begin typing your search above and press return to search.

క‌రోనా మ‌న‌కే.. మోడీకి కాదు.. ఆయ‌న ఇన్‌కం ఎంత పెరిగిందో తెలుసా?

By:  Tupaki Desk   |   25 Sep 2021 8:30 AM GMT
క‌రోనా మ‌న‌కే.. మోడీకి కాదు.. ఆయ‌న ఇన్‌కం ఎంత పెరిగిందో తెలుసా?
X
దేశంలో క‌రోనా ఎఫెక్ట్‌తో అంద‌రి వేత‌నాలు.. త‌గ్గిపోయాయి. కొంద‌రు ఉద్యోగాల‌ను కూడా పోగొట్టుకున్నారు. ఇక‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాలు.. అప్పుల కుప్ప‌లుగా మారాయి. దీంతో క‌రోనా న‌ష్టం ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే.. కొంద‌రి వేత‌నాలు.. ఆదాయాలు.. సంప‌ద‌లు పెర‌గ‌డం.. గ‌మ‌నార్హం. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థ‌ల ఆదాయాలు పెరిగాయి. అయితే.. ఇప్పుడు రాజ‌కీయ నేత‌ల ఆదాయాల విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌ధానంగా దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆదాయం కోరోనా క‌ష్ట కాలంలోనూ.. 22 ల‌క్ష‌లు పైచిలుకు పెర‌గ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

సాధారణ జీవితం గడిపే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏటా తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఈ క్ర‌మంలో తాజాగా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. క‌రోనా విజృంభించిన‌ 2020లో రూ. 2 .85 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ రూ. 22 లక్షలు పెరిగి.. 3 కోట్ల 7 లక్షల రూపాయలకు చేరింది. అంటే.. క‌రోనా కుదిపేసిన స‌మ‌యంలోనూ ప్ర‌ధాని.. నెల‌కు 2 ల‌క్ష‌ల రూపాయ‌లు వెనుకేసుకున్నారన్న‌మాట‌.

అదేస‌మ‌యంలో చాలా మంది కేంద్ర మంత్రుల్లానే మోడీకి కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లేవు. ప్రభుత్వం నుంచి పొందే రూ.రెండు లక్షల జీతమే ఆయనకు ముఖ్య ఆదాయ వనరు. దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటి వల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఇక‌, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(రూ.8.9 లక్షలు), ఎల్ఐసీ పాలసీలు(1.5 లక్షలు), ఎల్&టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్లో మోడీకి (2012లో రూ. 20 వేలకు కొనుగోలు చేశారు) పెట్టుబడులు ఉన్నాయి.

గుజరాత్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో మోడీకి ఫిక్స్డ్ డిపాజిట్ లు ఉన్నాయి. గతేడాది ఫిక్స్డ్ డిపాజిట్ విలువ రూ. 1.6 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి అది రూ. 1.86 కోట్లకు చేరింది. ఇక‌, ఈ ఏడాది మార్చి 31 నాటికి మోడీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ లక్షా 48 వేల రూపాయలు. బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 1.5 లక్షలు. నగదు రూపంలో రూ. 36 వేలు ఉన్నాయి.

2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ ఎలాంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయలేదు. 2002లో కొనుగోలు చేసిన ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ విలువ రూ. 1.1 కోట్లుగా ఉంది. అయితే ఇది ఉమ్మడి ఆస్తి. మరో ముగ్గురికి ఇందులో వాటా ఉంది. మ‌రోవైపు.. దేశ ప్ర‌ధాని అయిన‌ప్ప‌టికీ.. త‌న వ‌ద్ద సొంత వాహ‌నం అంటూ.. ఏమీ లేద‌ని..క‌నీసం మోపెడ్ కూడా లేద‌ని.. ప్ర‌ధాని తాజాగా ఇచ్చిన డిక్ల‌రేష‌న్‌లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.