Begin typing your search above and press return to search.

గులాం నబీ కోసం మరిన్ని సర్ప్రైజెస్ వెయిటింగ్.. . ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 2:30 PM GMT
గులాం నబీ కోసం మరిన్ని సర్ప్రైజెస్ వెయిటింగ్.. . ?
X
దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు గులాం నబీ అజాద్. కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగి ఎంతో ఎత్తుకు ఎదిగిన నేత ఆయన. గాంధీ నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఆయన ఒకసారి కాశ్మీర్ ముఖ్యమంత్రిగానే కాదు, కేంద్ర మంత్రిగా పలు మార్లు పనిచేశారు. ఆయనది దాదాపుగా అర్ధ శతాబ్దానికి చేరువ అవుతున్న రాజకీయ జీవితం. ఏపీలో చంద్రబాబు లాంటి వారు కాంగ్రెస్ లో ఆయన నాయకత్వాన యువజన వింగ్ లో పనిచేశారు.

ఇక దేశంలోని మైనారిటీ నాయకులలో ఎన్న తగిన నేతగా ఉన్నారు. ఆయన్ని ఇందిరాగాంధీ నమ్మింది. రాజీవ్ గాంధీ అక్కున చేర్చుకున్నారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి చాలా మంది ప్రధానులు మెచ్చిన నేతగా ఉన్నారు. నిన్నా మొన్నటి వరకూ సోనియా గాంధీకి కూడా అత్యంత సన్నిహితుడు ఆయన. అయితే కాంగ్రెస్ పార్టీ తాజా పోకడల మీద ఆయన కొంత అసహనంతో ఏకంగా సోనియాకే లేఖ రాసి ఆ పార్టీకి ఇపుడు గిట్టనివారు అయ్యారు.

ఒక విధంగా కాంగ్రెస్ లోనే ఉన్నా గులాం నబీ అజాద్ ఆ పార్టీలో అసంతృప్తి నేతగానే చెబుతున్నారు. పైగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ అయిన వేళ ప్రధాని మోడీ ఆయన్ని ఆకాశానికెత్తేస్తూ పొగిడిన తీరు కూడా కాంగ్రెస్ పెద్దలకు ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ ఇలా ఉంచితే మోడీకి మంచి దోస్త్ గులాబ్ నబీ అజాద్ అని రాజ్యసభ సాక్షిగా మోడీ రివీల్ చేసేంతవరకూ లోకానికి పెద్దగా తెలియదు.

ఇక కాంగ్రెస్ లో అజాద్ ఉన్నా కూడా రాజ్యసభ సభ్యత్వం మరోసారి రెన్యూవల్ చేయకుండా కాంగ్రెస్ పెద్దలు ఆయన పట్ల తమ వైఖరి ఇదే అని చెప్పేశారు అనుకోవాలి. ఈ టైమ్ లో బీజేపీ మాత్రం అవకాశం వచ్చిన ప్రతీసారీ గులాం నబీని పొగుడుతూనే ఉంది. తాజాగా దేశంలో అత్యున్నత పురస్కారం అయిన పద్మభూషణ్ కి ఆయన్ని ఎంపిక చేయడం ద్వారా తమ అభిమానాన్ని మరోసారి చాటుకుంది.

నిజానికి కాశ్మీర్ నుంచి వచ్చి దేశంలో పెద్ద నాయకుడిగా వెలిగిన గులాం నబీకి ఈ పురస్కారం ఇవ్వడం సముచితమే. కానీ ఇపుడు రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే కనుక ఈ ఎంపిక పట్ల అనేక రకాలుగా రాజకీయ చర్చ సాగుతోంది. ఆయన వంటి శిఖరాయమానమైన కీర్తి కలిగిన మైనారిటీ నాయకుడిని దగ్గర చేసుకోవడం ద్వారా బీజేపీ తక్షణ ప్ర‌యోజనాలు అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నెరవేర్చుకోవాలని చూస్తోంది అన్న మాటా వినిపిస్తోంది. ప్రముఖ‌ మైనారిటీ నేతను గౌరవించామని చెప్పడం ద్వారా ఆ వర్గం నుంచి రాజకీయ పంట పండించుకోవాలన్న ఆశ ఉందని కూడా అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఇదే ఏడాది దేశంలో రెండు అత్యున్నత రాజ్యాంగ పదవులు ఖాళీ అవుతున్నాయి. జూలైలో రాష్ట్రపతి ఎన్నిక ఉంది. ఆగస్ట్ లో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే గులాం నబీకి వీటిలో ఏదో ఒక పదవి ఇస్తారని ప్రచారం గట్టిగానే సాగుతోంది. ఆయన్ని ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం ద్వారా బీజేపీ తమ వాడుగా చేసుకొవాలనుకుంటోంది అని కూడా అంటున్నారు. అంటే చూడబోతే తొందరలోనే మరిన్ని సర్ప్రైజెస్ గులాం నబీ కోసం వెయిట్ చేస్తున్నాయన్న మాట. వీటిని అందరితో పాటు కాంగ్రెస్ కూడా కనీ విని తరించడమే మిగిలిందేమో.