Begin typing your search above and press return to search.

చెక్ బౌన్సు కేసులపై సుప్రీం కీలక వ్యాఖ్య.. ఏమన్నదంటే?

By:  Tupaki Desk   |   5 March 2021 4:53 AM GMT
చెక్ బౌన్సు కేసులపై సుప్రీం కీలక వ్యాఖ్య.. ఏమన్నదంటే?
X
పేరుకు పోయిన చెక్ బౌన్సుల కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. లక్షలాది కేసులు దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో చెక్ బౌన్సు కేసులు నిలిచిపోవటం సరికాదని పేర్కొంది. దాదాపు 35లక్షల కేసులు పరిష్కారం కాకుండా న్యాయం కోసం కోర్టులో నలిగిపోతున్నాయి. ఇలాంటివేళ.. వీటిని తగ్గించటం కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అనివార్యమన్న అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు పార్లమెంటుకు అధికారం కల్పిస్తున్న రాజ్యాంగంలోని 247వ అధికరణను వినియోగించుకోవాలని కేంద్రానికి చెప్పింది.

దేశంలోని అన్ని జిల్లా కోర్టులో పెండింగ్ లో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతానికి పైగా ఉన్న చెక్ బౌన్సు కేసులు భారీగా పేరుకుపోవటం ఒక వింతగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఈ అంశాన్ని సుప్రీం సుమోటోగా విచారణకు స్వీకరించింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ముందుకు ఈ విషయం వచ్చింది. దీంతో.. ఈ అంశంపై ధర్మసనానికి సలహాలు ఇవ్వటానికి సీనియర్ అడ్వకేట్లు నియమితులయ్యారు. తాజాగావిచారణ సందర్భంగా సుప్రీంధర్మాసనం.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని పేర్కొంది.

అయితే.. ఈ మాటకు కేంద్రం తరఫు లాయర్ భిన్నంగా స్పందించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో చెక్ బౌన్స్ కేసులు సత్వరం పరిష్కారం కావని కేంద్రం అభిప్రాయపడింది. దీనిపై ధర్మాసనం భిన్నంగా స్పందించింది. నిందితులు కోర్టులకు హాజరు కాకపోవటం వల్లే ఎన్ఐ యాక్టుకేసులుభారీగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. అయితే..ఈ అభిప్రాయాన్ని ధర్మాసనం తోసి పుచ్చింది. చట్ట ప్రక్రియ సజావుగా సాగటానికి 247వ అధికరణనుకేంద్రం వినియోగించుకోవచ్చని సుప్రీం పేర్కొంది. మరి.. కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.