Begin typing your search above and press return to search.

హిజాబ్ వ్యవహారంపై అత్యవసర పిటీషన్ కు సుప్రీం నో

By:  Tupaki Desk   |   11 Feb 2022 12:30 PM GMT
హిజాబ్ వ్యవహారంపై అత్యవసర పిటీషన్ కు సుప్రీం నో
X
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఈ మేరకు పిటీషన్ ను తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

హిజాబ్ పిటీషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండని సూచించారు. ఆదేశాలు వెలువడక ముందే ఏం చేయగలమని.. ఈ అంశాన్ని పెద్దది చేయవద్దని సూచించారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి.. ఢిల్లీకి తీసుకురావడం సరైందేనా? అని ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నామని.. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటామని తెలిపారు.

హిజాబ్ వ్యవహారాన్ని పెద్దది చేయకండని సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్ తో ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటీషన్ ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకూ ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

పిటీషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ముస్లిం మహిళలకే నష్టమని.. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఓ విద్యార్థి పిటీషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటీషన్ విచారణకు సుప్రీం నో చెప్పింది.

ఇదే పిటీషన్ పై వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో ఎలా సవాల్ చేస్తారని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనివ్వండని.. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దని తుషార్ వ్యాఖ్యానించారు.

ఇక గురువారం ఫాతిమా బుష్రా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటీషన్ ను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆమె తరుఫున కాంగ్రెస్ సీనియర్ నేత న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. మేం పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ రమణ తెలిపారు.