Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు సంచలనం.. ఠాక్రేకు షాక్.. అసలైన శివసేన వారిదేనా?

By:  Tupaki Desk   |   27 Sep 2022 3:43 PM GMT
సుప్రీంకోర్టు సంచలనం.. ఠాక్రేకు షాక్.. అసలైన శివసేన వారిదేనా?
X
బీజేపీ పెద్దాయన నరేంద్రమోడీని ఎదిరిస్తే ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి గతి పడుతుందన్న దానికి ఇదొక మంచి ఉదాహరణ. బీజేపీతో పొత్తు పెట్టుకొని మరీ మహారాష్ట్రలో గెలిచిన శివసేన సీఎం కుర్చీకోసం కక్కుర్తి పడి బీజేపీని కాలదన్ని తనకు బద్ధశత్రువైన కాంగ్రెస్ తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చినా మెజార్టీ లేక బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంది. శివసేన ఇచ్చిన షాక్ తో బీజేపీ రగిలిపోయింది.

మూడేళ్ల శివసేన సర్కార్ పాలన పూర్తయ్యాక పూర్తిగా వ్యతిరేకత వచ్చాక శివసేనలోని రెబల్ ‘ఏక్ నాథ్ షిండే’ను తిరుగుబావుట ఎగురవేయించి.. శివసేన ఎమ్మెల్యేలందరినీ లాగేసి దాని పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రేను సీఎం కుర్చీలోంచి విజయవంతంగా దించేసింది మోడీ బ్యాచ్. అనంతరం తిరుగుబాటు శివసేన నేత ఏక్ నాథ్ షిండేనే సీఎం కుర్చీలో కూర్చండబెట్టి మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది.

కట్ చేస్తే ఇప్పుడు శివసేన మెజార్టీ ఎమ్మెల్యేలంతా ఏక్ నాథ్ వెంట ప్రభుత్వంలో ఉన్నారు. మిగిలిన పదో , పన్నెండు మందితో ఉద్దవ్ ఠాక్రే మిగిలారు. అయితే ఇక్కడే పంచాయితీ వచ్చిపడింది. మెజార్టీ ఉన్న తమదే శివసేన పార్టీ అని.. ఎన్నికల గుర్తు ‘విల్లు బాణం’ కూడా తమదేనని ఏక్ నాథ్ షిండే ప్రకటించాడు. దీనిపై ఉద్దవ్ ఠాక్రే విభేదించి సుప్రీంకోర్టుకు ఎక్కాడు. ఎన్నికల సంఘానికి పార్టీ తానే స్థాపించానని తమదేనని వాదించాడు.

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ను ఎలాగైతే చంద్రబాబు బయటకు పంపి పార్టీని ఓన్ చేసుకున్నాడో ఇప్పుడు ఏక్ నాథ్ షిండే సైతం శివసేనను ఓన్ చేసుకొని ఉద్దవ్ ఠాక్రేకు అదే గతి పట్టించాడు.

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన నాదేనంటూ సుప్రీంకోర్టుకు ఎక్కి ఈసీని ఆదేశించాలని వాదించాడు. కానీ సుప్రీంకోర్టులో ఉద్దవ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ప్రస్తుత మహారాష్ట్ర సీఎం, శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే వాదనకే సుప్రీంకోర్టులో మద్దతు లభించింది. ఏక్ నాథ్ షిండే వినతిని పరిశీలించాలంటూ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.

దీంతో ఇప్పుడు బాల్ ఎన్నికల సంఘానికి చేరింది. ఠాక్రే, షిండే వర్గాల్లో అసలైన శివసేన ఎవరిది అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘం పేరుకు స్వతంత్ర్య సంస్థ కానీ బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోంది. మోడీ సర్కార్ నియంత్రిస్తుందన్న మాట అందరికీ తెలిసిందే. సో శివసేన పార్టీని ఠాక్రే నుంచి లాగేసి షిండేకు కట్టబెట్టడం ఖాయం. ఆయన శివసేనను బీజేపీలో కలిపేసి ఉద్దవ్ ఠాక్రేను డమ్మీని చేయడం ఖాయం. ఇలా బీజేపీని ఎదురించిన పాపానికి ఉద్దవ్ ఠాక్రే కనీసం పార్టీ లేకుండా.. ఎన్నికల గుర్తు లేకుండా నిండా మునిగినట్టు అయిపోయిన పరిస్థితి నెలకొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.