Begin typing your search above and press return to search.

అత్యాచార బాధితుల వివరాలు వెల్లడిస్తే కఠిన చర్యలు తప్పవు

By:  Tupaki Desk   |   16 Sep 2021 7:27 AM GMT
అత్యాచార బాధితుల వివరాలు వెల్లడిస్తే కఠిన చర్యలు తప్పవు
X
అత్యాచార బాధితులు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసింది. చివరికి మరణించినవారికి కూడా గౌరవం ఉంటుందని, వారిని బజారుకు ఈడ్చడానికి వీలులేదని, అత్యాచార బాధితుల వివరాలు వెల్లడికి సంబంధించి అంశాన్ని విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్ల లోపు బాలికలు అత్యాచారానికి గురైన ఘటనల్లో వారి పేర్లు, పోటోలు, చిరునామా, కుటుంబ నేపథ్యం, స్కూలు, వ్యక్తిగత విషయాలు వంటివి పత్రికలు, ప్రసార సాధనాలు బహిర్గతం చేస్తే పోక్సో చట్టం 2012 ప్రకారం చర్యలు తప్పవు.

ఇలాంటి చర్యలకు పాల్పడితే మీడియా సంస్థల యజమానులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆరు నెలల నుంచి ఏడాది వరకూ జైలు శిక్ష ఉంటుందని హెచ్చరిం చింది. మీడియా ప్రతినిధులు ఈ విషయం గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవా లని, చట్ట పరిధిలో పనిచేయాలని విజ్ఞపి చేసింది. బాధితులు బతికే ఉన్నా, బ్రతికి లేకపోయినా, వారు మైనర్లే అయినా, దివ్యాంగులైనా కూడా వారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని స్పష్టం చేసింది. ఎందుకంటే వీరి జీవన హక్కుకు భంగం కలిగించరాదని, ఒకవేళ వారి పేర్లు వెల్లడిస్తే వారి అనంతర జీవనం మచ్చబారిపోతుందని అలా బయటపడిపోయిన బాధ జీవితాంతం వారిని వెన్నాడుతునే ఉంటుందని కోర్టు తెలిపింది.

వ్యక్తి మానసిక స్థితిగతులు ఎలా ఉన్నా ప్రతి ఒక్కరికీ గోప్యత హక్కు ఉంటుందని, అత్యాచార బాధితుల విషయంలో ఈ హక్కుకు ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం కలిగించకూడదని రూలింగ్ ఇచ్చింది. 18 ఏళ్లు పైబడి అత్యాచారానికి గురైన వారి వివరాలను తెలపాలనుకుంటే బాధితులతో రాత పూర్వకంగా అనుమతి తప్పనిసరి అని తెలిపింది. అనుమతి తీసుకోకుండా ప్రచురించినా, ప్రచారం చేసినా ఐపిసి సెక్షన్‌ 228(ఎ) ప్రకారం చర్యలు తప్పవు. తాజాగా సైఫాబాద్ ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటన పై తమ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమె ఫోటోను షేర్ చేస్తున్నారు. దీనితో సుప్రీం తీర్పు ప్రకారం అత్యాచార బాధితుల ఫోటో , పేరు , కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించవద్దు అని , శిక్ష తప్పదు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.