Begin typing your search above and press return to search.

మోడీ గారు...ఈ మాట సుప్రీం చెప్పాలా?

By:  Tupaki Desk   |   8 April 2020 11:30 PM GMT
మోడీ గారు...ఈ మాట సుప్రీం చెప్పాలా?
X
దేశంలో ప్రతి చర్చ - ప్రతి సమావేశం - ప్రతి చర్య - ప్రతి విషయం కరోనా చుట్టూనే తిరుగుతోంది. తాాజాగా కోర్టులకు వస్తున్న విచారణలు కూడా అవే. తాజాగా కరోనా పరీక్షలపై శశాంక్ డియో సుధి అనే న్యాయవాది పిటిషను వేయగా దానిని విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. దేశంలో కరోనా పరీక్షలను మొదట ప్రభుత్వమే చేసింది. అనంతరం ఆ పరీక్షలు చేసే అధికారం గుర్తింపు పొందిన ప్రైవేటు ల్యాబులకు కూడా కేంద్రం సంక్రమింపజేసింది. కరోనా ప్రకృతి విపత్తు. దాని నివారణ - చికిత్స మొత్తం ప్రభుత్వ బాధ్యత. ఈ నేపథ్యంలో ఖరీదైన ఈ పరీక్షలకు సామాన్యులపై ఆర్థిక భారం వేయడమేంటి? అని కోర్టును ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో మనందరం గెస్ చేయగలం. అవును కోర్టు ప్రభుత్వానిదే ఖర్చు బాధ్యత అని చెప్పింది. కానీ ఇక్కడ చర్చ కోర్టు తీర్పు గురించి కాదు... అసలు ప్రభుత్వంలోని ఈ ఎస్కేపిజమనే లక్షణం. వందేళ్ల తర్వాత వచ్చిన అతిపెద్ద విపత్తు ఇది. 2 కోట్ల మందిని బలితీసుకున్న స్పానిష్ ఫ్లు కంటే ఇది ప్రమాదకరమైనది. ఎందుకంటే దాని కంటే ఇది వేగంగా వ్యాపించే వ్యాధి. పరీక్ష ఎంత ఆలస్యంగా జరిగితే అంత ఎక్కువమందికి ఇది వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలన్నీ అందుకే దీనిపై యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్నాయి. అమెరికా రోజు లక్ష మందికి పైగా పరీక్షలు చేస్తోంది. మన జనాభాలో అమెరికా జనాభా కేవలం నాలుగో వంతు. కానీ 130 కోట్ల మంది ఉన్న భారత్ లో ఇంతవరకు చేసిన టెస్టుల సంఖ్య తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే... మన టెస్టుల సంఖ్య ఇప్పటివరకు లక్ష పాతిక వేలు దాటలేదు. కారణం ఏంటి? టెస్టుల చేసే పరికరాల విషయంలో భారత్ తీసుకోవాల్సినంత శ్రద్ధ తీసుకోలేదు. ఆ మాటకు వస్తే అత్యధిక జనాభా - అందులోను అతి ఎక్కువ నిరక్షరాస్య జనాభా ఉన్న మనదేశమే టెస్టులు చేయడంలో ముందుండాలి. కానీ అది జరగలేదు.

ప్రభుత్వం వచ్చిన వారికి - ఎవరైనా ఫిర్యాదు చేసిన వారికి తప్ప తనంతట తాను ర్యాండమ్ టెస్టులు చేయడంలో ఆసక్తి చూపలేదు. అంత సంఖ్యలో పరికరాలను సంపాదించుకోలేదు. అయితే... ఆస్ప్రతుల మీద పడుతున్న ఒత్తిడిని తప్పించుకోవడానికి - కావాలంటే ప్రైవేటు ల్యాబుల్లో చేయించుకోండి అంటూ ప్రభుత్వం కొన్నింటికి అనుమతి ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దేశానికి మనుషులు ఎంత ముఖ్యమో - ఎకానమీ అంత ముఖ్యం. ఎంత త్వరగా టెస్టులు చేస్తే అంత త్వరగా మనం ఈ లాక్ డౌన్ నుంచి బయటపడగలం. ఎంత త్వరగా లాక్ డౌన్ నుంచి బయటపడితే అంత త్వరగా మన జీవితాలు మెరుగుపడతాయి. లేకపోతే ఆర్థిక పతనం వైపు దారితీస్తాం. సుప్రీంకోర్టు చెప్పే దాకా పరిస్థితిని తెచ్చుకోవడమే అత్యంత శోచనీయం. చివరాఖరికి టెస్టుల ఖర్చు ప్రభుత్వమే భరించేలా చూడమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు.