Begin typing your search above and press return to search.

అప్పు వసూళ్ళ విషయంలో బ్యాంకులపై మండిపడ్డ సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   17 May 2022 2:43 AM GMT
అప్పు వసూళ్ళ విషయంలో బ్యాంకులపై మండిపడ్డ సుప్రీంకోర్టు
X
ఇచ్చిన అప్పుల వసూలు విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న విధానాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. రైతులకు ఇచ్చిన రుణాలు వసూలు కోసం బ్యాంకులు కర్కశంగా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకిచ్చిన అప్పు వసూళ్ళ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న బ్యాంకులు మరి కార్పొరేట్లకు ఇస్తున్న అప్పుల వసూళ్ళకు కూడా ఇలాగే వ్యవహరిస్తోందా అంటు నిలదీసింది.

వందలు, వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని ఎగ్గొడుతున్న బడా కార్పొరేట్ల విషయం ఏమిటంటూ ప్రశ్నించింది. వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న పెద్దలను పట్టించుకోరు కానీ పేద రైతులపైన మాత్రం ప్రతాపం చూపిస్తారా అంటు ఆక్షేపించింది.

ఇంతకీ విషయం ఏమిటంటే మధ్యప్రదేశ్ కు చెందిన మోహన్ లాల్ పటీదార్ అనే రైతు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చే విషయంలో వన్ టైం సెటిల్మెంట్ పథకం క్రింద పటీదార్ కు బ్యాంకు ఒక అవకాశమిచ్చింది. తీసుకున్న రు. 36.5 లక్షల అప్పుల్లో పటీదార్ 95 శాతం కట్టేశాడు.

అయితే 95 శాతం అప్పు తీర్చిన తర్వాత తీర్చాల్సిన అప్పును బ్యాంకు రు. 36.5 లక్షల నుండి 50 లక్షలకు పెంచింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తు పటీదార్ కోర్టులో కేసు వేశారు. స్ధానిక కోర్టు కూడా బ్యాంకును తప్పుపట్టింది. అయితే బ్యాంకు మాత్రం లోకల్ కోర్టు తీర్పును సవాలు చేస్తు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసు విచారణ సందర్భంగానే న్యాయమూర్తులు పై వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ బ్యాంకు చేసిన అన్యాయం కళ్ళకు కనబడుతున్నా ఇంకా తమదే రైట్ అని బ్యాంకు అధికారులు వాదిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయమై విచారణలో కూడా బ్యంకు రైతులకు వ్యతిరేకంగా వాదనలు వినిపించింది.

అయితే న్యాయమూర్తులు బ్యాంకు అధికారుల వాదనపై మండిపడ్డారు. ఇపుడు తాము బ్యాంకుకు అనుకూలంగా తీర్పిస్తే ఇదే పద్దతిలో దేశంలోని రైతులనంతా ఇబ్బంది పెడతారని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలు రద్దు చేసి రైతులను చావగొట్టడం ఏమిటంటే న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకు బ్యాంకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు.