Begin typing your search above and press return to search.

ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ కేసులో సుప్రీం కీలక తీర్పు..!

By:  Tupaki Desk   |   2 Dec 2022 8:48 AM GMT
ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ కేసులో సుప్రీం కీలక తీర్పు..!
X
ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ విదేశీయులకు క్రయోజనిక్ ఇంజిన్ కు సంబంధించిన కీలక పత్రాలను రహస్యంగా చేరవేశారని ఆయనపై కేరళ పోలీసులు గతంలో అభియోగాలు మోపారు. అయితే గూఢచర్యం కేసులో నంబీ నారాయణ్ ను కుట్రపూరితంగా ఇరికించారని సీబీఐ పోలీసులు తొలి నుంచి తమ వాదనలు విన్పిస్తున్నారు.

1994లో వెలుగు చూసిన ఈ ఘటన వల్ల రెండు దశాబ్దాలపాటు క్రియోజనిక్ ఇంజన్ పనులు ఆలస్యంగా జరుగాయని.. ఈ వ్యవహారంలో విదేశీ కుట్ర ఉందని సీబీఐ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా నంబీ నారాయణపై జరిగిన కుట్రపై కేరళ హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి.

ఈ కేసు నిమిత్తం నాటి పోలీస్ అధికారులైన గుజరాత్ మాజీ డీజీపీ ఆర్బీ శ్రీ కుమార్.. రిటైర్డ్ నిఘా అధికారి పీఎస్ జయప్రకాశ్.. ఇద్దరు పోలీస్ అధికారులు ఎస్. విజయన్.. థంపి ఎస్ దుర్గా దత్ లపై సీఐబీ కేసులు పెట్టింది. అయితే నిందితులు మందుస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా కేరళ హైకోర్టు ఇటీవల మంజూరు చేసింది.

ఈ నిర్ణయంపై సీబీఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. నంబి నారాయణ్ పై కుట్రపూరితంగా కేసు పెట్టడం వల్ల క్రియోజనిక్ ప్రాజెక్టు పనులు నిలిచి పోయాయని.. రెండు దశాబ్దాలపాటు రోదసీ కార్యక్రమాలు వెనుకబడ్డాయని సీబీఐ సుప్రీంలో వాదించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని కోర్టుకు విన్నవించారు. విదేశీ కుట్రలో పోలీసులు భాగమై ఉండొచ్చని పేర్కొంది.

నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల విచారణలో ఆటంకం కలిగే అవకాశం ఉందని సీబీఐ తన వాదనలు వినిపించారు. సీబీఐ వాదనలు విన్న కోర్టు నిందితులకు కేరళ హైకోర్టు ఇచ్చిన ముందస్తు తీర్పును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లను తిరిగి కేరళ హైకోర్టుకే పంపిస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది.

నిందితుల బెయిల్ పిటిషన్ ను మళ్లీ మొదటి నుంచి విచారించి నాలుగు వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని కేరళ హైకోర్టుకు సుప్రీం గడువు విధించింది. అదేవిధంగా బెయిల్ దరఖాస్తులపై కోర్టు తీర్పు వెలువడే దాకా నిందితులను అరెస్టు చేయద్దని జస్టిస్ ఎం ఆర్ షా.. జస్టిస్ సీ.టీ. రవికుమార్ ధర్మాసనం నేడు కీలక తీర్పు వెలువరించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.