స్పీకర్ అధికారాల్ని ప్రశ్నించిన సుప్రీం కోర్ట్!

Tue Jan 21 2020 17:42:42 GMT+0530 (IST)

Supreme Court Guidlines for Speaker

గత కొన్ని ఏళ్లుగా స్పీకర్ అధికారాలపై దేశంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. స్పీకర్ సభాపతిగా ఉంటారు సరే ఆయన వినే మాట మాత్రం అధికార పార్టీ చెప్పినట్టే ఉంటుంది. విపక్షాల ఆవేదనను కూడా స్పీకర్ వినే పరిస్థితి ఎంత మాత్రం ఉండదు అనేది వాస్తవం. రాజకీయంగా బలంగా ఉన్న పార్టీలకు చెందిన స్పీకర్ అయితే కనీసం ప్రతిపక్ష సభ్యుల మాట కూడా వినే పరిస్థితి కూడా పెద్దగా ఉండదు. ఈ నేపధ్యంలో స్పీకర్ అధికారాలపై పార్లమెంటుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.పార్టీ ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లపై స్పీకర్కు ప్రస్తుతమున్న నిర్ణయాధికారంపై పార్లమెంట్ పునరాలోచించాలని సుప్రీం కీలక సూచనలు చేసింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన మణిపూర్ ఎమ్మెల్యే ఆటవీశాఖ మంత్రి శ్యాంకుమార్ ఆ తర్వాత బీజేపీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. దీనితో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని పిటీషన్ వేసింది.

నాలుగు వారాల్లో మణిపూర్ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనీ లేకపోతే మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వద్దకు రావొచ్చని సుప్రీం కోర్ట్ సూచించింది. తమ సూచనను పార్లమెంట్ పరిగణనలోకి తీసుకోవాలని కోరింది సుప్రీం కోర్ట్. ఏదో ఒక పార్టీ నుంచి ఎన్నికై స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఇలాంటి అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవచ్చా లేదా అనేది పునరాలోచించాలి అని సుప్రీం చేసిన సూచన ఇప్పుడు కీలకంగా మారింది.