ఈసీకి సుప్రీం కోర్టు మొట్టికాయ..

Mon Apr 15 2019 15:16:21 GMT+0530 (IST)

Supreme Court Fires On Election Commission

మునుపెన్నడూ లేనంతా ఉదాసీనంగా.. పక్షపాతంగా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందన్న విమర్శలున్నాయి. కేంద్రంలోని మోడీకి మేలు జరిగేలా ఎన్నికల షెడ్యూల్ నుంచి ఐటీ దాడులు.. వివిధ రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు చేపడుతోందన్న ఈసీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో మోడీ భారత సైన్యం దాడులపై మాట్లాడుతున్నా నోరెత్తలేని పరిస్థితుల్లో ఈసీ చేష్టలుడిగి చూస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ప్రతినిధులు మంగళవారం తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసి సంచలనం రేపింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు విచ్చలవిడిగా విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్నారు.  అయినా ఈసీ తమ వారిని ఒకలా ప్రతిపక్షంలోని మరోలా చూస్తోంది. ఇలా ఎన్నికల ప్రవర్తన నియమావళిని సక్రమంగా పాటించకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. నియామవళిని ఈసీ చెక్ చేస్తున్నారా లేదా అనే విషయంపై ఈసీని ప్రశ్నించింది.

తాజాగా ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ చీఫ్ మాయావతి యూపీ సీఎం యోగి ఆధిత్యానాత్ చేసిన కామెంట్స్ ను సుప్రీం కోర్టు ప్రస్తావించింది. వారిద్దరూ కుల మతపరమైన విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా ఎందుకు ఎలాంటి శిక్షలు విధించలేదని దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీ ప్రతినిధులను సుప్రీం ఆదేశించింది.  మంగళవారం స్వయంగా హాజరు కావాలని కోరడంతో ఈసీ పరువు పోయినట్టైంది.