భుజానికి బ్యాగేసుకుని!..వైరల్ గా టెర్రరిస్ట్ వీడియో!

Tue Apr 23 2019 20:06:29 GMT+0530 (IST)

Suicide Bomber Entering Church

శ్రీలంక రాజధాని కొలంబో సహా మరో రెండు నగరాల్లో రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 321 మంది ప్రాణాలు కోల్పోగా... వందలాది మంది గాయాలపాలయ్యారు. ఒకే రోజు గంటల వ్యవధిలో వరుసగా 8 చోట్ల బాంబులను పేల్చేసిన ఉగ్రవాదులు లంకలో కల్లోలం సృష్టించారు. అయితే ఈ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజీలు ఇప్పటిదాకా పెద్దగా రాలేదనే చెప్పాలి. అయితే నేటి ఉదయం నుంచి ఈ దాడులకు పాల్పడ్డ ఓ ఉగ్రవాదికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారిపోయింది.కొలంబోలో చర్చిలో బాంబు పేల్చిన ఉగ్రవాదిగా ఇతడిని గుర్తించారు. ఈస్టర్ పర్వదినాన రద్దీగా ఉన్న చర్చిలో బాంబు దాడి ద్వారా ఎక్కువ మందిని పొట్టనబెట్టుకోవచ్చన్న ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ చర్చిని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. సదరు చర్చిలో బాంబును పేల్చే పనిని భుజానెత్తుకున్న ఉగ్రవాది... ఏ ఒక్కరికీ అనుమానం రాకుండా వ్యవహరించిన తీరు ఈ వీడియోలో కనిపిస్తోంది. శక్తివంతమైన బాంబులతో కూడిన బ్యాగ్ ను భుజానకేసుకుని సామాన్యుడిలాగే చర్చి వద్ద ఎంట్రీ ఇచ్చిన ఆ ముష్కరుడు... అక్కడ ఉన్న చిన్న పిల్లల తల నిమరుతూ - చర్చికి వచ్చిన క్రైస్తవుడిగానే కనిపించాడు. పిల్లల తలలను నిమురుతూ ముందుకు కదిలిన అతడిని ఏ ఒక్కరు కూడా అనుమానించలేదు. అసలు అతడు ఉగ్రవాదిగానే ఏ ఒక్కరికీ కనిపించలేదు.

వీడియో ఫుటేజీలో కూడా బాంబును పేల్చేంతరవకు అతడిని ఉగ్రవాదిగా అనుమానించే అవకాశాలు కూడా లేవు. చర్చి బయట ఓ చిన్నారి తల నిమిరి ముందుకు సాగిన ఆ ఉగ్రవాది...కిక్కిరిసిన చర్చిలో చోటు లేక బయట నిలుచుకుని ఉన్న క్రైస్తవ భక్తులను దాటుకుంటూ ముందుకు సాగాడు. అలాగే ముందుకు వచ్చి... చర్చి వేదికకు సమీపంలోని తలుపు వద్ద లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బాంబును పేల్చాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. అసలు ఈ ఉగ్రవాదిని చూసిన ఏ ఒక్కరికి కూడా అతడు అంత ఘాతుకానికి పాల్పడతాడన్న అనుమానమే రాలేదు. 20 ఏళ్లకు కాస్త అటూఇటూ వయసు ఉన్న ఈ ఉగ్రవాది ఇతరులకు తనపై అనుమానం రాకుండా వ్యవహరించిన తీరు ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.