Begin typing your search above and press return to search.

అలాంటి ఇంట్లో ఉంటే వైరస్ సోకుతుందట !

By:  Tupaki Desk   |   31 May 2020 1:30 AM GMT
అలాంటి ఇంట్లో ఉంటే వైరస్ సోకుతుందట !
X
చైనాలో వెలుగులోకి వచ్చి ..ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి పై ప్రపంచం లోని చాలామంది శాస్త్రవేత్తల ప్రయోగాలు చేస్తున్నారు. ఈ వైరస్ తీవ్రత ఎలా ఉండబోతుంది..వైరస్ ఏ విధంగా ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.. ఈ మహమ్మారి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది.. దీనికి అడ్డుకట్ట వేయడం ఎలా.. వంటి ప్రశ్నలపై శాస్త్రవేత్తల అధ్యయనం కొనసాగుతోంది. ఈ సమయంలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

యూకేలోని సర్రే యూనివర్సిటీ పరిశోధకులు ప్రశాంత్ కుమార్ నేతృత్వం వహించిన బృందం ఈ విషయాన్ని తెలిపింది. దీనిపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఎన్విరాన్‌ మెంటల్ ఇంటరాక్షన్ జర్నల్ ‌లో ఓ కథనం ప్రచురితమైంది. దాని ప్రకారం.. వైరస్ 100 మైక్రోన్ ‌ల కంటే తక్కువ సైజ్ కలిగి ఉంటుందని వివరించారు. మనుషులు వదిలే గాలి, తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వచ్చే సూక్ష్మ బిందువుల్లోని నీరు ఆవిరైపోయినా.. వైరస్ కణాలు మాత్రం పరిసరాల్లోనే ఉండిపోతాయని వారు తెలిపారు.

ఇక ఏసీలు ఉన్నప్పటికీ, వాటి పనితీరు సమర్ధంగా లేకపోతే ప్రమాదం ఉన్నట్లేనని పేర్కొన్నారు. అందుకే గాలి వెలుతురు సరిగా లేని ఇళ్లలో ఉంటే వైరస్ ముప్పు అధికంగా ఉన్నట్లేనని వారు వివరించారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు వెంటిలేషన్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రశాంత్ కుమార్ తెలిపారు. దీనిపై లోతైన పరిశోధనలు జరుపుతున్నట్లు ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.