Begin typing your search above and press return to search.

మహాత్ముడి హత్య కేసును రీ-ఓపెన్ చేయాలి, ప్రశ్నలు సంధించిన బీజేపీ ఎంపీ

By:  Tupaki Desk   |   16 Feb 2020 1:46 PM GMT
మహాత్ముడి హత్య కేసును రీ-ఓపెన్ చేయాలి, ప్రశ్నలు సంధించిన బీజేపీ ఎంపీ
X
బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణియన్ స్వామి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలన్నారు. గాంధీ హత్యానంతర పరిణామాలపై వరుస ప్రశ్నలు కురిపించారు.

గాంధీ మృతదేహానికి పోస్టుమార్టం లేదా ఆటోస్పై ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షులైన అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదన్నారు. గాడ్సే రివాల్వర్‌ లో ఎన్ని ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే, నాథూరామ్ గాడ్సే కాల్చిన రివాల్వర్‌ ను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేకపోయారని నిలదీశారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు లేవని, అందుకే ఈ కేసును రీ-ఓపెన్న చేయాలని డిమాండ్ చేశారు.

ఓ ట్వీట్‌ లో ప్రశ్నలు వేసిన సుబ్రమణియణ్ స్వామి.. మరో ట్వీట్‌ లో గాంధీ హత్య రోజు ఏం జరిగిందో పేర్కొన్నారు. అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నో 52వ పేజీని ప్రస్తావిస్తూ.. ఆ రోజు సాయంత్రం గం.5.05 సమయానికి అతను నాలుగు బుల్లెట్ శబ్దాలు విన్నట్లు చెప్పారని, (కోర్టులో మాత్రం 3 విన్నట్లు చెప్పారు) అయితే గాడ్సే మాత్రం తాను రెండుసార్లు మాత్రమే కాల్పులు జరిపినట్లు చెప్పాడని పేర్కొన్నారు.

అదే ఏపీఐ (అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్) గాంధీ బిర్లా హౌస్‌ లో సాయంత్రం గం.5.40కి చనిపోయినట్లు పేర్కొందని, అంటే మహాత్ముడు 35 నిమిషాల పాటు బతికే ఉన్నారని గుర్తు చేశారు. సుబ్రహ్మణియన్ స్వామి ట్వీట్ పైన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, గాంధీ హత్య కేసుపై పునర్విచారణ చేపట్టాలనే డిమాండ్లు పలుమార్లు వినిపించాయి.