Begin typing your search above and press return to search.

జయలలిత మృతి పై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   19 Oct 2020 10:30 AM GMT
జయలలిత మృతి పై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు !
X
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , అమ్మా .. జయలలిత మరణించి ఏళ్లు గడుస్తున్నా కూడా ఆమె మృతి పై ఇంకా అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయి. తాజాగా జయ మృతి పై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చడంలో ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం లకు చిత్తశుద్ధి లేదని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిచి అధికారంలోకి రాగానే జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరుపుతామని స్టాలిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జయ మృతి వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేస్తామన్నారు.

సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీలు పిటిషన్‌పై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు సక్రమంగా వాదించడం లేదని, జయ మృతిపై విచారణ జరుపుతున్న రిటైర్డ్‌ జడ్జి ఆరుముగసామి కమిటీ ఆరోపణలు చేయడం దిగ్ర్భాం తి కలిగిస్తోందన్నారు. జయ మృతి మిస్టరీపై నిజ నిర్ధారణకు విధించిన రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిషన్‌ ఇంతవరకు నివేదిక ఇవ్వలేదని, ఆమె మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా.. ఇంతవరకు నివేదిక ఎందుకు బైటకు రాలేదని స్టాలిన్ ప్రశ్నించారు. తాజాగా కమిషన్ గడువు మరో మూడు నెలలు పొడిగించాలని కోరడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు స్టాలిన్. జయలలిత మరణం పై నిజా నిజాలు తేల్చేందుకు మూడున్నరేళ్ల క్రితం ఆర్ముగ స్వామి కమిషన్ ఏర్పాటైంది. అయితే ఇంత వరకు ఎలాంటి నివేదికను ఆ కమిషన్ బైట పెట్టలేక పోయింది.

ఇప్పటికే పలుమార్లు ఆ కమిషన్ గడువు పెంచుకుంటూ పోయింది ప్రభుత్వం. ఈనెల 24వ తేదీతో పొడిగించిన గడువు కూడా ముగుస్తుంది. దీంతో మరో 3 నెలలు గడువు పొడిగించాలని ఆర్ముగస్వామి కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది. జయలలిత మృతి చెందినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఆ విచారణ కమిటీ విచారణకు హాజరుకాలేదని, జయలలిత మృతిలో దాగిన మర్మాలు బహిర్గతం చేయడానికి ధర్మయుద్ధం చేస్తానని గొప్పలు చెప్పుకున్న ఆయన మౌనం పాటిస్తున్నారని స్టాలిన్‌ పేర్కొన్నారు. తొలుత జయ మృతిపై సీబీఐ విచారణ జరపాలని కూడా పన్నీర్‌సెల్వం పట్టుబట్టిన విషయాన్ని రాష్ట్రప్రజలు మరువలేదన్నారు. జయ మృతిపై తాను చేసిన డిమాండ్లను అన్నాడీఎంకే ప్రభుత్వం ఆమోదించకపోయినా పన్నీర్‌సెల్వం కేంద్రంలోని బీజేపీ పాలకుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వంలో భాగస్వామిగా మారిపోయారని స్టాలిన్‌ విమర్శించారు.

ఆరుముగసామి కమిటీ 2018 డిసెంబర్‌ 12న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పన్నీర్‌సెల్వంకు సమన్లు పంపినా ఆయన పట్టించుకోలేదన్నారు. కమిటీ సమన్లు జారీ చేసి 22 నెలలు గడిచినా పన్నీర్‌సెల్వం విచారణ కమిటీ ఎదుట హాజరుకాలేదని, ‘న్యాయపోరాటం జరపడంలో భయమెరుగని పులిలాంటి వ్యక్తి’నని గొప్పలు చెప్పుకునే పన్నీర్‌సెల్వం పిల్లిలా వ్యవహరించడం భావ్యమేనా అని స్టాలిన్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాదుల తీరుపై ఆ కమిషన్‌ లేఖ రాయడం గమనిస్తే.. జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని బయటకు తీసే విషయంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టం అవుతోందని ఆరోపించారు స్టాలిన్. స్టాలిన్ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో డీఎంకే అధికారంలో రాగానే జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరిపి, ఆమె మృతి వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేస్తుందని స్టాలిన్‌ అన్నారు. అయితే ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న సమయంలో మరోసారి జయలలిత మరణ మిస్టరీని తెరపైకి తెచ్చి కలకలం రేపారు స్టాలిన్.