Begin typing your search above and press return to search.

ఆమె వద్దు అన్నారు.. చివరికి.సాధించారు.... ?

By:  Tupaki Desk   |   24 Oct 2021 3:30 PM GMT
ఆమె వద్దు అన్నారు.. చివరికి.సాధించారు.... ?
X
రాజకీయ నాయకుల ఆలోచనలు ఎపుడూ ఒక్కటే. పార్టీలు వేరు, రంగులు వేరు అయినా వ్యవహార శైలి దాదాపుగా ఒకే విధంగా ఉంటుందేమో. ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా మంది రూల్స్ దాటి వెళ్తారు, అధికారులు మాత్రం అది కాదు అని బ్రేకులు వేస్తారు. ఇక్కడే వారికీ వీరికీ పేచీ వస్తుంది. విశాఖ వంటి మెగా సిటీలో కూడా ఇలాంటి వివాదమే వచ్చింది. మొత్తానికి రాజకీయమే గెలిచింది. సమర్ధవంతమైన అధికారిణిగా ముద్రపడిన జీవీఎంసీ కమిషనర్ గుమ్మళ్ళ సృజన మీద బదిలీ వేటు పడింది. ఆమె విశాఖ జిల్లా జాయింట్ కలెక్ట్ గా పనిచేశారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ మెచ్చి మరీ ఆమెకు కమిషనర్ గా చేసి కీలకమైన బాధ్యతలు అప్పగించారు.

ఆమె ముక్కుసూటిగా వ్యవహరించారు. విశాఖ పరిధిలోని అక్రమాల మీద కన్నెర్ర చేశారు. అక్రమార్కుల భరతం పట్టేశారు. అక్రమ నిర్మాణల కూల్చివేతలతో ఆమె దూకుడు పెంచారు. జీవీఎంసీ స్థలాలను ఆక్రమించుకున్న వారి మీద ఆమె మూడవ కన్నే తెరిచారు. ఇది చాలా భరించరానిదైంది. అధికార పార్టీ నేతలకు కక్కలేక మింగలేక అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దాంతో వారంతా చాలా కాలంగా ఆమె మీద గుర్రుగా ఉన్నారు. ఆ మధ్యన ప్రత్యేకంగా వైసీపీకి చెందిన కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు, కీలకమైన నాయకులు అంతా సమావేశమయ్యారు. కమిషనర్ ని అర్జంటుగా విశాఖ నుంచి బదిలీ చేయాలని మంత్రి అవంతి శ్రీనివాసరావును, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని గట్టిగా కోరినట్లుగా ఆనాడే వార్తలు వచ్చాయి.

మొత్తం వ్యవహారం అలా సాగి చివరికి సృజన విశాఖ నుంచి బదిలీ కావాల్సి వచ్చింది. ఈ విషయంలో మాత్రం నగర ప్రజలు, మేధావుల నుంచి విమర్శలు వస్తున్నాయి. విశాఖ వంటి సిటీకి సృజన లాంటి అధికారి ఉంటే ఎంతో మేలు జరిగేదని కూడా అంటున్నారు కొత్తగా వచ్చిన పాలకవర్గానికి సైతం కమిషనర్ వైఖరి గిట్టకపోవడంతోనే చివరికి ఆమె బదిలీ దాక కధ సాగింది అంటున్నారు. మొత్తానికి విశాఖలో జరిగిన ఈ అనూహ్గ్య బదిలీని బట్టి చెప్పాల్సి వస్తే పక్కాగా పాలిటిక్స్ సక్సెస్ అయిందనే కామెంట్స్ వస్తున్నాయి.