Begin typing your search above and press return to search.

భలే మంచి చౌక బేరం.. అమ్మకానికి శ్రీలంక ఎయిర్‌లైన్స్‌

By:  Tupaki Desk   |   17 May 2022 8:11 AM GMT
భలే మంచి చౌక బేరం.. అమ్మకానికి శ్రీలంక ఎయిర్‌లైన్స్‌
X
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.. మన పొరుగు ద్వీప దేశం.. శ్రీలంక. నిత్యావసరాలు, ఇంధనం, ప్రాణావసర మందుల కొరతతో అల్లాడుతోంది. ఎవరు ఆపన్న హస్తం అందిస్తారా అని ప్రపంచ దేశాల వైపు బిత్తర చూపులు చూస్తోంది. ఇప్పటికే మనదేశం పెద్దన్న పాత్రను నిలబెట్టుకుంటూ శ్రీలంకకు కొన్ని వందల కోట్ల డాలర్లు విలువ చేసే బియ్యం, మందులు, ఇంధనాన్ని సమకూర్చింది. అంతేకాకుండా భారీ మొత్తంలో నిధులను అందజేసింది. అయినా దున్నపోతు మీద కురిసిన వాన చందంగా శ్రీలంకను నడిసంద్రంలో నుంచి బయటపడేయటానికి అవి సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను అమ్మకానికి పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఎవరైనా ప్రైవేటు సంస్థలు ముందుకొస్తే శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను అమ్మడానికి నిర్ణయించింది. గతేడాది మార్చి చివరి నాటికి శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు 370 బిలియన్ల నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ప్రైవేటుపరం చేసినా దాని నష్టాలు పూడవు. ఆ భారం కూడా శ్రీలంక ప్రజల నెత్తిన పడాల్సిందే. విమానం ఎక్కినవారితోపాటు ఇప్పటివరకు విమానం ముఖం చూడనివారు ఎయిర్‌లైన్స్‌ను ఆదుకోక ముందుకు రాక తప్పదు. అయినా రణిల్‌ విక్రమ సింఘే నేతృత్వంలోని ప్రభుత్వం శ్రీలంకను కష్టాల నుంచి బయటపడేయటానికి తన వంతు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ 61 దేశాల్లోని 126 నగరాలకు తన విమానాలను నడుపుతోంది. 1975లో ఏర్పాటైన శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు 2006 తర్వాత.. అది కూడా ఒకే ఒక్కసారి లాభాలు వచ్చాయి. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్‌లో పనిచేసేవాళ్లకి వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరణ చేయడం తప్ప శ్రీలంక ప్రభుత్వం ముందు మరో దారి కనిపించడం లేదు.

గతంలో పలుమార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్‌ విక్రమ సింఘే శ్రీలంకను ఆపద నుంచి గట్టెక్కించడానికి తన సర్వశక్తులు, అనుభవాన్ని ఒడ్డుతున్నారు. మహీంద రాజపక్స, గొటబయ రాజపక్స సోదరులు, వీరి కుమారులు, బంధువులు గత పదేళ్లుగా ప్రభుత్వంలో తిష్టవేసి శ్రీలంకను దోచుకుతిన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. భారత్‌తో చెలిమిని కాలదన్ని చైనాకు దగ్గరయ్యారని మండిపడుతున్నారు. భారత్‌ను దెబ్బతీయడానికి చైనా తమను వాడుకుంటోందని రాజపక్స సోదరులు గ్రహించలేకపోయారు.

అధిక వడ్డీలకు చైనా ఇచ్చిన లక్షల కోట్ల డాలర్లను తమ విలాసాలకు ఖర్చు పెట్టిన రాజపక్స సోదరులు దేశాన్ని అప్పుల నడిసంద్రంలోకి నెట్టారు. చివరకు ప్రజల ఆగ్రహానికి గురై మహీంద రాజపక్స ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రణిల్‌ విక్రమ్‌ సింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మరి కొద్దిరోజుల్లో రణిల్‌ విక్రమ్‌ సింఘే భారతదేశం రానున్నారు. ప్రధాని నరేంద్రమోదీని కలసి శ్రీలంకను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటివరకు భారత్‌ అందించిన భారీ సాయానికి కృతజ్ఞతలు తెలపనున్నారు.