డిప్యూటీ సీఎం అనుకుంటే - మంత్రి పదవి దక్కింది!

Tue Aug 20 2019 12:59:01 GMT+0530 (IST)

Sree Ramulu Gets Ministry in Yeddyurappa Cabinet

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీరాములు పేరు ప్రముఖంగా వినిపించింది. అంతకు ముందు కూడా ఆయన కర్ణాటక రాజకీయంలో ప్రముఖుడు గాలి జనార్ధన్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా గుర్తింపును కలిగి ఉన్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనను సీఎం అభ్యర్థి అన్నట్టుగా కూడా ట్రీట్ చేశారు. ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా  తిప్పారు.హెలీకాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా పర్యటింపజేశారు. తెలుగు మూలాలు ఉన్న వాల్మికి కులస్తుడు శ్రీరాములు. బళ్లారి ప్రాంతానికి చెందిన వ్యక్తి. పార్టీ పై అసంతృప్తితో ఒకసారి తిరుగుబాటు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీఎం అభ్యర్థి అనే ప్రచారం పొందారు.

అయితే అప్పుడు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఏదో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు కానీ రెండు రోజులకే అది కూలిపోయింది. యడియూరప్ప అప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో శ్రీరాములు ఊసే లేకుండా పోయిందప్పుడు.

అదలా ఉంటే ఇప్పుడు కర్ణాటకలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. యడియూరప్ప కేబినెట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీమ్ లో శ్రీరాములుకు చోటు దక్కింది. అయితే ఒక దశలో శ్రీరాములుకు డిప్యూటీ సీఎం అనే ప్రచారమూ జరిగింది. ఆ ఆఫర్ ను కాంగ్రెస్ వాళ్లు కూడా ఇచ్చారంటారు. బీజేపీకి తిరుగుబాటు చేసి వస్తే డిప్యూటీ  సీఎంగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు ఆఫరిచ్చారంటారు. అయితే వాటికి శ్రీరాములు ఆకర్షితుడు కాలేదు.

ఇప్పుడు యడియూరప్ప కేబినెట్లో అయితే శ్రీరాములుకు చోటు దక్కింది. రెడ్డి బ్రదర్స్ కు సన్నిహితుడు అయిన ఈయనకు అలా అవకాశం లభించింది.