Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా.. ఖాయమేనా?

By:  Tupaki Desk   |   20 Aug 2019 7:12 AM GMT
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా.. ఖాయమేనా?
X
తాము రాజకీయంగా బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ వాళ్లు రకరకాల వ్యూహాలను అనుసరిస్తారనే పేరు వచ్చింది. ప్రత్యేకించి అమిత్ షా రాజకీయం మొదలయ్యాకా పార్టీ కోసం సామదానబేదదండోపాయాలు ఉపయోగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అలా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా బీజేపీ పాగా వేసింది.

ఇక బీజేపీ చూపు ప్రస్తుతం తెలంగాణ మీదే ఉందని వేరే చెప్పనక్కర్లేదు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో దక్కిన సీట్లతో బీజేపీనే ఆశ్చర్యపోయింది. తమకు ఈ రాష్ట్రంలో అవకాశం ఉందనే భావనకు ఆ పార్టీ రానే వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణపై పట్టు బిగించడానికి వివిధ ఎత్తుగడలు వేస్తోంది కమలం పార్టీ.

అందులో భాగంగా తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీల నుంచి అనేక మంది నేతలను చేర్చుకుంటూ ఉంది. రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేసినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును - తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేక ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. ఎలాగూ హిందుత్వ అజెండాను అమలు చేయడానికి అవకాశం ఉండనే ఉంది.

దీనికి తోడు కేంద్రంలో ఉన్న అధికారాన్ని కూడా బీజేపీ ఉపయోగించుకునేలా ఉంది. అందులో భాగంగా హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన ఉందట. అలా చేస్తే తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చు. అందుకే ఆ వెంటనే రెండో రాజధాని అనే మందును వేస్తారట. దేశానికే రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తే స్థానికుల నుంచి సానుకూల భావన రావొచ్చు.

అలాగే తెలంగాణను ఉద్ధరించినట్టుగా కూడా ప్రచారం చేసుకోవచ్చు. ఆ మేరకు కమలం పార్టీ వ్యూహరచన చేస్తున్నట్టుగా సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇలాంటి కీలక నిర్ణయాలు అమలు కానున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో!