గజపతి రాజుల వివాదం... విడాకులైనా వారసత్వ హక్కు ఉన్నట్టే!

Fri Jun 18 2021 09:25:56 GMT+0530 (IST)

Special Story On Mansas Trust Controversy

నిజమే... విజయనగర రాజులు పూసపాటి వంశంలో ఇటీవల రేకెత్తిన వివాదం... కొత్త హక్కులకు పకడ్బందీగా వీలునామా రాసినట్టుగా చెప్పాలి. అదేంటంటే... భర్త నుంచి విడాకులు తీసుకున్నా... భార్యకు తన భర్త తరఫున వారసత్వ హక్కులు ఉంటాయట. భార్యకే కాకుండా భార్య తరఫు పిల్లలు వారి పిల్లలకు కూడా ఈ వారసత్వ హక్కులు దఖలు పడతాయట. వినడానికి విడ్డూరంగానే ఉన్నా... మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా చాలా కాలం తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వ్యవహారాన్ని పరిశీలించిన ఏ ఒక్కరికైనా ఇదే తరహా భావన కలుగుతుంది. ఈ కథాకమామీషు ఏమిటో చూద్దాం పదండి.గజపతుల చివరి రాజు పీవీజీ రాజు 1958లో ప్రారంభించిన మాన్సాస్ ట్రస్టు ఇపుడు రాజకీయంగా అనే వివాదాల్లో నానుతోంది. ట్రస్టు బైలా ప్రకారం మగవాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే ఛైర్మన్ గా ఉండాలని అప్పట్లో పీవీజీ రాజు ఓ రూలు పెట్టారు. అలా ఎందుకు పెట్టారన్నది ఇపుడు అప్రస్తుతం. అయితే రూలు రూలే కాబట్టి తన స్ధానంలో ఆనంద గజపతి రాజు కూతురిగా ఎంట్రీ ఇచ్చిన సంచయిత ఛైర్ పర్సన్ కావటానికి వీల్లేదని అశోక్ కోర్టులో కేసు వేసి గెలిచారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... అసలు ట్విస్టు ఇక్కడే మొదలైంది. అదేమిటంటే పీవీజీరాజు పెద్ద కొడుకు ఆనందగజపతిరాజుకు కొడుకులు లేరు. విడాకులు తీసుకున్న ఉమా గజపతిరాజు కూతురే సంచయిత. రెండో భార్య సుధకు కూడా కూతురే..ఊర్మిళ.

కోర్టు ద్వారా మళ్ళీ ఛైర్మన్ పగ్గాలు చేపట్టిన అశోక్ గజపతిరాజుకు కూడా కొడుకులు లేరు. కూతురు అదితి మాత్రమే వారసురాలు. వీలునామా ప్రకారం మగవాళ్ళు మాత్రమే ఛైర్మన్ కావాలంటే మరి భవిష్యత్తులో పరిస్ధితి ఏమిటి ? ఇద్దరు కొడుకుల్లో ఎవరికీ కొడుకులు లేరు కాబట్టి అశోక్ తర్వాత ట్రస్టు పగ్గాలు ఎవరికి వెళతాయి? ఇపుడిదే ప్రశ్న జనాల్లో బాగా నలుగుతోంది. దాంతో పీవీజీ రాజు తొలి వివాహం గురించి జనాల్లో చర్చలు మొదలయ్యాయి. అదేమిటంటే పీవీజీ రాజుకు కూడా ఇద్దరు భార్యలట. ఇపుడు చెప్పుకుంటున్న ఆనంద్ అశోక్ రెండో భార్య సంతానమట. మొదటిభార్యకు ఇద్దరు కొడుకులున్నారట. వారు అలోక్ గజపతిరాజు మోనిష్ గజపతిరాజని ఇద్దరు కొడుకులు. వీరిలో మోనిష్ వివాహం చేసుకోలేదు. అలోక్ కు ఓ కొడుకున్నాడు. అతనిపేరు విహాన్ గజపతిరాజట. అయితే అలోక్ మోనిష్ తల్లి కూడా పీవీజీ రాజుతో విడాకులు తీసుకున్నారు. కాబట్టి టెక్నికల్ గా వీళ్ళకు ఇపుడు పూసపాటి వంశంపై హక్కులు లేవు.

అయితే సంచయిత తల్లి కూడా ఆనంద గజపతిరాజుతో విడాకులు తీసుకున్నా... ఇప్పుడు సంచయిత తానే వారసురాలినంటూ ఎంట్రీ ఇచ్చారు కదా. ఆ మాదిరిగానే అలోక్ మోనిష్ కూడా కూడా రేపు వారసత్వం కోసం వచ్చే  అవకాశాలు లేకపోలేదు. మరి ట్రస్టు రూల్ ప్రకారం మగవాళ్ళు పెద్దకొడుకే ట్రస్టు పగ్గాలు చేపట్టాలంటే అశోక్ తర్వాత అలోక్ గానీ మోనిష్ గానీ లేదంటే అలోక్ కొడుకు విహాన్ రాజు కానీ పిక్చర్లోకి రావచ్చేమో. ఎందుకంటే ట్రస్టు పగ్గాల కోసం సంచయిత ఎలాంటి వాదన వినిపించిందో అదే వాదన అలోక్ మోనిష్ విహాన్ రాజుకు కూడా వర్తిస్తుంది. మొత్తంగా గజపతి రాజుల వివాదం... విడాకులు తీసుకున్న భార్యకు ఆమె సంతానానికి ఆ సంతానం సంతానానికి కూడా వారసత్వ హక్కులు దఖలు పడతాయన్న కొత్త వాదన ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.