Begin typing your search above and press return to search.

ఏపీకి ప్రత్యేక హోదా..వైసీపీ మరిచిపోలేదబ్బా!

By:  Tupaki Desk   |   17 Nov 2019 4:07 PM GMT
ఏపీకి ప్రత్యేక హోదా..వైసీపీ మరిచిపోలేదబ్బా!
X
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత... ఆర్థిక లోటుతో ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపించడం - అందుకు నాటి యూపీఏ సర్కారు కూడా ఓకే అనడం జరిగిపోయాయి. అయితే దానిని సాధించుకునే క్రమంలో ఏపీకి చెందిన పార్టీలు టీడీపీ - వైసీపీ తమదైన శైలి వ్యూహాలను అమలు చేస్తూ వస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీ కంటే వైసీపీనే ముందంజలో ఉందన్న విషయం మరోమారు రుజువైందని చెప్పక తప్పదు. సోమవారం నుంచి మొదలు కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలోనే వైసీపీ ప్రత్యేెక హోదా నినాదాన్ని వినిపించేసింది. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇప్పటికే తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకున్న టీడీపీ కూడా ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యమని చెప్పుకున్నా.. ఆ డిమాండ్ ను సభలోనే వినిపించాలని నిర్ణయించుకుని వైసీపీ కంటే వెనుకబడిపోయిందని చెప్పక తప్పదు.

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో భాగంగా లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీతో పాటు ముగ్గురు సభ్యులున్న టీడీపీ కూడా హాజరైంది. సమావేశంలో భాగంగా సభా వ్యవహారాలను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా అన్ని పార్టీలు సహకరించాలని జోషి విజ్ఝప్తి చేశారు. ఆ తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అప్పటిదాకా సైలెంట్ గానే కూర్చున్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్ది - లోక్ సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి... తమ వాదనను కాస్తంత గట్టిగానే వినిపించారు.

ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందేనని సాయిరెడ్డి - మిథున్ రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమ పార్టీ వైఖరి ఇదేనని - ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదాకా తాము విశ్రమించేది లేదని కూడా వారిద్దరూ తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా మిగిలిన విభజన హామీలను కూడా నెరవేర్చాల్సిందేనని కూడా వారు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను తక్షణమే ఆమోదించడంతో పాటుగా ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఆర్థిక లోటును భర్తీ చేయడంతో పాటుగా వెనుకవబడిన ఏడు జిల్లాలకు రూ.100 కోట్ల చొప్పున మొత్తం రూ.700 కోట్ల గ్రాంట్ ను తక్షణమే విడుదల చేయాలని కూడా వారు గళమెత్తారు. రామాయపట్నంలో మేజర్ పోర్టును నిర్మించాలని, విజయనగరం జిల్లా సాలూరులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా వారు కోరారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను సభా సమావేశాలు ప్రారంభం కాకముందే వినిపించిన వైసీపీ... టీడీపీ కంటే ముందంజలోనే ఉందని చెప్పక తప్పదన్న వాదన వినిపిస్తోంది.