Begin typing your search above and press return to search.

మ‌రోసారి చిక్కుల్లో సోనియాగాంధీ!

By:  Tupaki Desk   |   28 Jun 2022 4:18 AM GMT
మ‌రోసారి చిక్కుల్లో సోనియాగాంధీ!
X
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఆమె ఎన‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సోనియా గాంధీ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి పీపీ మాధ‌వన్ ఒక అత్యాచారం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై మాధ‌వ‌న్ అత్యాచారానికి పాల్పడ్డాడని 26 ఏళ్ల మహిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయ‌న‌పై పోలీసులు వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఈ మేర‌కు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు మాధవన్‌పై కేసు నమోదైంది. దీంతో పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. 2018లో తన భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కార్యక్రమాలకు హోర్డింగ్​లు పెట్టేవాడని బాధితురాలు పోలీసుల‌కు ఇచ్చిన‌ ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల‌కు హాజ‌ర‌య్యేవార‌ని తెలిపింది.

అయితే అనారోగ్యంతో తన భర్త 2020, ఫిబ్రవరిలో మ‌ర‌ణించ‌డంతో త‌నను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయ‌ని వివ‌రించింది. ఈ క్ర‌మంలో ఆర్థిక సాయం కోసం ఢిల్లోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యానికి వెళ్లాన‌ని వెల్ల‌డించింది. అక్క‌డ సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి మాధవన్‌ని కలిసి త‌న దుస్థితిని వివ‌రించాన‌ని చెప్పింది.

ఇక అప్ప‌టి నుంచి పీపీ మాధవన్ నాతో చాలా సార్లు మాట్లాడాడ‌ర‌ని బాధిత మ‌హిళ తెలిపింది. త‌న‌ ఆర్థిక పరిస్థితిని ఆయ‌న‌కు వివ‌రించ‌డంతో త‌న‌కు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చాడ‌ని పేర్కొంది. అప్పటి నుంచి త‌ర‌చూ త‌న‌తో ఫోనులో మాధ‌వ‌న్ మాట్లాడుతున్నాడ‌ని వివ‌రించింది.

ఈ క్ర‌మంలో ఈ ఏడాది జనవరి 21న ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూ ఉంద‌ని త‌న‌కు సందేశం పంపాడ‌ని తెలిపింది. ఢిల్లీ సురేంద్రనగర్‌​లో ఉన్న‌ ఓ ఇంటికి వెళ్లాలని సూచించాడ‌ని తన ఫిర్యాదులో వెల్ల‌డించింది. తాను మాధ‌వ‌న్ చెప్పిన‌ట్టు అక్క‌డికి వెళ్ల‌గా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

కాగా.. బాధిత మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదుపై సోనియా గాంధీ కార్య‌ద‌ర్శి పీపీ మాధ‌వ‌న్ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 (రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని ద్వారకా డిప్యూటీ కమిషనర్ హ‌ర్షవర్ధన్ తెలిపారు. మాధవన్ బాధితురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ అనుమతి లేకుండా శారీరక సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.