Begin typing your search above and press return to search.

అమ్మను కలిసి సారీ చెప్పినా సీఎం పదవి ఊడటం పక్కానట

By:  Tupaki Desk   |   30 Sep 2022 4:22 AM GMT
అమ్మను కలిసి సారీ చెప్పినా సీఎం పదవి ఊడటం పక్కానట
X
పిలిచి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటే బుద్దిగా ఒప్పుకోవాల్సింది పోయి.. అవసరం లేని అతిని ప్రదర్శించిన రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కమ్ కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కు దిమ్మ తిరిగే షాకిచ్చారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం రాజస్థానే. గతంలో దేశ చిత్రపఠంలో ఎక్కడ వేలు పెట్టినా కాంగ్రెస్ పవర్ లో ఉన్న వైనం కనిపించేది. 2014లో కేంద్రంలో పవర్లోకి వచ్చిన మోడీ పుణ్యమా అని సమీకరణాలన్ని మారిపోవటం.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున రాష్ట్ట్రాల్లో అధికారాన్ని చేజార్చుకుంది కాంగ్రెస్.

తాజాగాపార్టీ అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్.. అన్ని అర్హతలు ఉన్న నేతగా అధిష్ఠానం భావించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన్ను రాజస్థాన్ ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించి.. ఆయన స్థానే యువ నేత సచిన్ పైలెట్ కు అందలం ఎక్కించాలని అనుకోవటం తెలిసిందే. అయితే.. గెహ్లాట్ వర్గం నుంచి ఊహించని రీతిలో తీవ్ర వ్యతిరేకత రావటమే కాదు.. దాదాపు 90 మంది సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టి వేరుగా సమావేశం అయ్యారు.

ఈ జట్టులో రాష్ట్ర పీసీసీ చీఫ్ కూడా ఉండటం పార్టీ అధినాయకత్వానికి షాకింగ్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన సోనియాగాంధీ.. గెహ్లాట్ ను ఢిల్లీ రావాలని ఆదేశించటం.. వ్యతిరేక వర్గం దూకుడుకు కళ్లాలు వేసేందుకు టీంను రంగంలోకి దింపారు అధినేత్రి.

సచిన్ పైలెట్ ను గెహ్లాట్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2020లో ఆయన చేసిన తిరుగుబాటును ఎలా మర్చిపోతారు? అని ప్రశ్నిస్తున్నారు. సచిన్ పైలెట్ తిరుగుబాటు సక్సెస్ అయితే.. ఇప్పుడు పరిస్థితి ఏమిటన్న మాటను వారు అడుగుతున్నారు.

పార్టీ చేతి నుంచి అధికారం పోకుండా నాడు అండగా నిలిచిన నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని గెహ్లాట్ వర్గం కోరుతోంది. అయితే.. కత్తి దూసినోళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదన్న కరకు ఆలోచనలో సోనియాగాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. తన ప్రమేయం లేకుండా జరిగిపోయిందని.. జరిగిన దానికి సారీ చెబుతూ 71 ఏళ్ల అశోక్ గెహ్లాట్ ఎంతగా చెప్పినా సోనియా మాత్రం ఆయన మీద వేటు వేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగావ్యవహరిస్తున్నారు.

ఈ మొత్తం చూసినప్పుడు పిలిచి జాతీయ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు సర్వం సిద్ధం చేసిన వేళ.. ఆ పదవితో పాటు.. తన వారికే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పి ఢిల్లీకి పోవాలన్న అశోక్ గెహ్లాట్ అత్యాశ మొదటికే మోసం తెచ్చేలా మారిందని చెప్పక తప్పదు. చేతిలో పవర్ ఉన్నా లేకున్నా.. పదవుల్లో ఉన్న వ్యక్తుల కన్నా.. సంస్థల్ని నిర్వహించే యజమానుల అధికారమే తిరుగులేదన్న చిన్న విషయాన్ని అంత సీనియర్ పొలిటీషియన్ మిస్ కావటం ఏమిటో?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.