Begin typing your search above and press return to search.

ఆ టాస్క్ పూర్తి చేస్తేనే రేవంత్ రెడ్డి బిగ్‌ బాస్!

By:  Tupaki Desk   |   10 Sep 2019 7:48 AM GMT
ఆ టాస్క్ పూర్తి చేస్తేనే రేవంత్ రెడ్డి బిగ్‌ బాస్!
X
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారని చాలాకాలంగా వినిపిస్తుందే కానీ అధిష్ఠానం మాత్రం ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో పీసీసీ అధ్యక్ష పీఠం కోసం టీకాంగ్రెస్‌లో ఆశావహులూ పెరుగుతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌ లోకి వచ్చిన ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కన్నూ ఆ పీఠంపై ఉంది. ఇటీవల ఆయన్ను పీసీసీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అధిష్ఠానం నుంచి ప్రకటన మాత్రం రాలేదు. అధిష్ఠానం రేవంత్ ను పీసీసీ ప్రెసిడెంట్ చేయడానికి సుముఖంగానే ఉన్నప్పటికీ పార్టీలోని దేశముదుర్లను ఆయన డీల్ చేయగలరా... ఆయనకు పదవి ఇస్తే పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్లు అసంతృప్తితో బయటకు వెళ్తే మరింత నష్టం కలుగుతుందేమోనని లోలోన టెన్షన్ పడుతోందట. అయితే.. ఇలా సందేహాలతో - భయాలతో ఎంతకాలం పార్టీని అంపశయ్ మీదే ఉంచుతాం.. దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలని భావించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రేవంత్‌ కు ఓ పరీక్ష పెట్టినట్లు వినిపిస్తోంది. ఆ పరీక్షలో నెగ్గి పీసీసీ అధ్యక్ష పదవి తీసుకోమని ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంతకీ... కాంగ్రెస్ బిగ్ బాస్ సోనియా ఇచ్చిన ఆ టాస్క్.. కాంగ్రెస్ నేతలందరినీ ఏకతాటిపైకి తేవడం. ఆ టాస్క్ లో రేవంత్ సక్సెస్ అయితే రేవంత్ రెడ్డికి టీకాంగ్రెస్ బిగ్‌ బాస్‌ గా ప్రకటిస్తామని.. అంటే టీపీసీసీ చీఫ్ గా అవకాశం ఇస్తామని తేల్చి చెప్పిందట హై కమాండ్. ఇందుకు కారణం సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తం కావడమే. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తారన్న సంకేతాలు రాగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. విహెచ్ బాహాటంగా రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. దీంతో అధిష్ఠానం ఇలా డిసైడ్ చేసిందని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటే కప్పల తక్కెడ. అలాంటి పార్టీలోని నేతలను తనకు మద్దతుగా మలచుకోవడం రేవంత్‌ కు ఆషామాషీ కాకపోవచ్చు. దీంతో రేవంత్ తొలుత రెడ్డి సామాజికవర్గ నేతల నుంచి నరుక్కుంటూ రావాలని ప్రయత్నిస్తున్నారట. అలాగే.. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్.. ఆ పదవిని ఆశిస్తున్న ఇతర నేతలను వ్యతిరేకించే మిగతా వర్గాలతో టచ్‌ లోకి వెళ్తున్నట్లు సమాచారం. మరి... సోనియా అప్పగించిన టాస్క్‌ లో రేవంత్ ఎంతవరకు సక్సెస్ అవుతారో.. టీ కాంగ్రెస్ బిగ్ బాస్ అవుతారో లేదో చూడాలి.