Begin typing your search above and press return to search.

భారీ ప్లాన్ తోనే అన్నయ్యను సోము కలిశారా?

By:  Tupaki Desk   |   9 Aug 2020 2:30 AM GMT
భారీ ప్లాన్ తోనే అన్నయ్యను సోము కలిశారా?
X
తన మాటలతో తరచూ వార్తల్లోకి రావటమే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే చాలు.. ఒంటికాలి మీద విరుచుకుపడే తత్త్వం సోము వీర్రాజు సొంతం. మిత్రుడిగా ఉన్న సమయంలోనే బాబును తరచూ ఆయన డిఫెన్సులో పడేసే వైనం తెలిసిందే. ఫైర్ బ్రాండ్ నేతగా ఉన్న ఆయన్ను ఢిల్లీ అధినాయకత్వం ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయటం తెలిసిందే. తనను పార్టీ అధ్యక్షుడిగా చేసిన వెంటనే.. ఢిల్లీకి వెళ్లి పెద్దల్ని కలిసి.. వారి ఆశీస్సులు పొందిన సోము.. మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో 2024లో ఏపీలో తాము అధికారాన్ని చేపడతామని చెప్పారు. పవన్ కల్యాణ్ తో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు లేని బీజేపీ.. 2024లో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకునే పార్టీగా ఆవిర్భావం చెందటం సాధ్యమేనా? అంటే సోము మాత్రం అవునని చెబుతారు. అదెలా అన్న ప్రశ్న అక్కర్లేదని.. తమ లెక్కలు తమకు ఉన్నాయని చెబుతారు.

ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన.. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చి మరీ కలవటం.. ఆయనతో కలిసి ఫోటోలు దిగటం వెనుక ఉన్న లెక్కలేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశ్లేషణలకు తెర తీశాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చిరు.. సోము భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందే అయినప్పటికీ.. ఏదో ఫోటోలు తీసుకోవటంలో భాగంగా జరిగిందన్నది మాత్రం కాదని చెప్పాలి.

ఏపీ జనాభాలో ఓట్ల శాతం అధికంగా ఉన్నప్పటికీ.. అధికారంలోకి రాని కాపు సామాజిక వర్గాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలోనూ అధ్యక్షుడిగా వ్యవహరించినకన్నా ప్రయత్నం చేసినా.. అంతగా ఆకట్టుకోలేకపోయారు.ఈ నేపథ్యంలో చిరు.. పవన్ లతో వారిని తన వైపునకు ఆకర్షించేలా చేయటంతో పాటు.. ఒక పెద్ద ఓటుబ్యాంకుగా మార్చాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో కీలక అంశం కూడా ఉందని చెబుతున్నారు.ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయటం.. టీడీపీలోని కాపు నేతల్ని బీజేపీలో చేరేలా చేయటం కూడా వ్యూహంలో భాగమని చెబుతున్నారు.

ఏపీలో ఇప్పటివరకు అధికారాన్ని సొంతం చేసుకోలేకపోయిన కాపుల్ని సమీకరించటం.. వారంరిని ఒక్క తాటి మీదకు తీసుకొచ్చే సవాలును చిరు ద్వారా పరిష్కరించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు పవన్ ను కలవటం వెనుక కూడా రెండు పార్టీల మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేయటమేనని చెబుతున్నారు. మొత్తంగా ఏదో బొకే ఇచ్చి.. శాలువా కప్పించుకోవటానికైతే మాత్రం సోము.. చిరును కలవలేదని చెప్పక తప్పదు.