Begin typing your search above and press return to search.

రాయలసీమ లో హైకోర్టు పెడితే అభివృద్ధి అయినట్టేనా

By:  Tupaki Desk   |   23 Nov 2021 4:30 PM GMT
రాయలసీమ లో హైకోర్టు పెడితే అభివృద్ధి అయినట్టేనా
X
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర చేపట్టారు అమరావతి రైతులు. ఈ యాత్ర ఇలా కొనసాగుతున్న సమయంలోనే తాజాగా జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

దీనితో అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ ధర్నాలు చేసిన ప్రజలు , నాయకులు స్వీట్స్ కూడా పంచుకున్నారు. కానీ , ఆ స్వీట్స్ అరిగేలోపే సీఎం జగన్ అసెంబ్లీ లో మరో కీలక ప్రకటన చేశారు. మళ్లీ కొత్త బిల్లును సమగ్రంగా తీసుకొస్తామని సోమవారం అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ప్రకటించడంపై ప్రతిపక్షాల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

మూడు రాజధానుల బిల్లు రద్దవతుందనే సంతోషించే లోపే.. మరో బిల్లు తీసుకొస్తామని చెప్పడంతో అమరావతి రైతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఏపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోర్టు పరిధి నుంచి తప్పించుకునేందుకే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందన్నారు.

రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రతిపక్ష నేతగా చెప్పిన జగన్, ఆ మాట అన్నారో లేదో సీఎం, మంత్రులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు సూచించారు. ఆత్మను టేబుల్ పై ‌పెట్టి సభలో మాట్లాడారని ఆయన ఎద్దేవా చేశారు. అంతరాత్మ సాక్షిగా సభలో అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. శాసనసభకు అబద్ధాలు, బండబూతులు, వ్యక్తిగత జీవితాలపై మాట్లాడేందుకు వినియోగిస్తున్నారని మండిపడ్డారు.

ఈ విషయంపై అసెంబ్లీ స్పీకర్ ఆలోచించాలని సూచించారు. రోజూ ప్రభుత్వాన్ని నడిపేందుకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బుల్లేవని.. అలాంటప్పుడు మీరేం చేయగలుగుతారని ఏపీ సర్కారును నిలదీశారు. ఈ విషయంలో మళ్లీ తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం గుంటూరుకు ఎయిమ్స్, తిరుపతిలో ఐఐఎం, కర్నూలు, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, విశాఖలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిందని సోము వీర్రాజు తెలిపారు. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా అక్కడి అభివృద్ధి ఎవరూ పట్టించుకోలేదని సోము వీర్రాజు అన్నారు.

కోర్టు పెడితే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. సీమ అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం వద్ద అసలు దానికోసం నిధులున్నాయా, అని ప్రశ్నించారు వీర్రాజు.

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే, మళ్లీసమగ్రమైన బిల్లును సభలోకి తీసుకొస్తామని చెప్పడం తో మరోసారి రాజధాని విషయంలో మరింత గందగోళానికి గురిచేశారంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.