మోడిపై ఇంత వ్యతిరేకతుందా ?

Mon May 03 2021 19:00:01 GMT+0530 (IST)

So much opposition to Modi?

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో నరేంద్రమోడిపై జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందనే స్పష్టమైంది. బెంగాల్ విషయంలో మొదటినుండి మోడి వివక్ష చూపుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఎలాగైనా మమతను ఓడించి బెంగాల్లో బీజేపీ జెండాను ఎగరేయాలని మోడి గట్టిగా డిసైడ్ అయ్యారు. దీనికి తగ్గట్లే ప్రతి సందర్భంలోను మమతను తీవ్రంగా వ్యతిరేకించారు. రోటీన్ గా అన్నీ రాష్ట్రాలకు రావాల్సినవి కూడా బెంగాల్ కు ఇవ్వకుండా మోడి బాగా ఇబ్బందులు పెట్టారు.మోడి ఉద్దేశ్యంలో కేంద్రం నుండి బెంగాల్ కు అందాల్సిన సాయం సకాలంలో అందకపోతే జనాలంతా మమతను అధికారానికి దూరంగా పెడతారని అనుకున్నారు. దీనికితోడు ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి మమతను మోడి అమిత్ షా జేపీ నడ్డా అండ్ కో ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అంతాపెట్టారు. దాంతో ఎన్నికలు మమత వర్సెస్ మోడి వ్యక్తిగత వైరమా అన్నట్లుగా సాగింది. హోరాహోరీగా సాగిన ఎనిమిది దశల  పోరాటంలో మమత గెలిచింది.

మమత గెలుపు కూడా మామూలుగా కాదు. బీజేపీకి మాడుపగిలిపోయేంత విజయాన్ని సాధించింది. 294 అసెంబ్లీలున్న బెంగాల్లో తృణమూల్ కు ఏకంగా 213 నియోజకవర్గాల్లో అపూర్వమైన గెలుపును జనాలు అందించారు. ఈ స్ధాయిలో మమత విజయంసాధిస్తుందని మోడి అండ్ కో ఏమాత్రం ఊహించుండరు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టిన గెలుపుమాదే అంటు మోడి షా అండ్ కో పదే పదే ఊదరగొట్టారు. తృణమూల్ కు ఇంతటి భారీ విజయం దక్కిందంటేనే మోడిపై జనాల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది.

మమతను ఇబ్బంది పెడుతున్నామని అనుకుంటునే యావత్ బెంగాల్ పై మోడి తీవ్రమైన వివక్షను చూపించటాన్ని జనాలు తట్టుకోలేకపోయారు. ఇదే సమయంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి నియంత్రణలో మోడి విఫలమయ్యారు. దాంతో బెంగాల్లో కూడా కేసులు బాగా పెరిగిపోయాయి. అంటే బీజేపీ గెలుపుపై కరోనా కాటు దెబ్బకూడా బాగానే పడిందని అనుకోవాలి.  కోరి తెచ్చుకున్న ఎనిమిది దశల పోలింగే చివరకు బీజేపీ కొంప ముంచేసిందన్న విషయం అర్ధమవుతోంది. మొత్తంమీద బీజేపీకి సీట్లు పెరిగినా అధికారాన్ని అందించేందుకు మాత్రం మెజారిటి జనాలు తీవ్రంగా వ్యతిరేకించారని అర్ధమైపోతోంది.