Begin typing your search above and press return to search.

వ్యతిరేకంగా నినాదాలు.. వెనుదిరిగిన వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   18 April 2021 8:30 AM GMT
వ్యతిరేకంగా నినాదాలు.. వెనుదిరిగిన వైసీపీ ఎమ్మెల్యే
X
తిరుపతి ఉప ఎన్నికల వేళ వైసీపీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కు గ్రామస్థుల నుంచి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే, వరప్రసాద్ తన నియోజకవర్గంలోని బురదగలి కొఠపాలెం సందర్శించగా.. ఆ గ్రామస్థులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గ్రామంలోని సమస్యలు తీరుస్తానని హామీనిచ్చి చేయని ఎమ్మెల్యేను గ్రామస్థులు నిలదీసినట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ గ్రామస్థులకు పలు హామీలు ఇచ్చారని.. ఎన్నికల తర్వాత ఆరు నెలల్లో గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారని గ్రామస్థులు చెబుతున్నారు. కానీ రెండేళ్లు అయినా తమ గ్రామ సమస్యలు తీర్చలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

రెండు రోజుల క్రితం స్థానిక తహశీల్ధర్ కార్యాలయంలో గ్రామస్తులు నిరసన ప్రదర్శన చేసి ఓటింగ్‌ను బహిష్కరిస్తామని బెదిరించారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. ఓటింగ్ రోజున ఎమ్మెల్యేతో పాటు కొంతమంది స్థానిక నాయకులు ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థుల వద్దకు వచ్చారు. ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.

దీంతో గ్రామస్థులు ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ నినాదాలు చేశారు. గ్రామస్థులు నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే వరప్రసాద్ వెనుదిరిగారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అన్ని ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉంటామని గ్రామస్థులు చెబుతున్నారు. మరోవైపు, తిరుపతి బైపోల్స్ లో 64.29% ఓటింగ్ నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో 79% కాగా ఈసారి తగ్గింది. ఓట్ల లెక్కింపు మే 2 న జరుగుతుంది.