తెలంగాణకు కొత్త కలవరం.. రోజు రోజుకు పెరుగుతున్న మరణాలు

Tue Jun 02 2020 09:15:47 GMT+0530 (IST)

Six deaths 94 new Virus cases reported in Telangana

మాయదారి రోగం దేశానికి వచ్చేసిన తర్వాత.. యావత్ దేశం అలెర్టు కావటానికి ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు అడుగులు ముందుకేసి లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. మహమ్మారి విస్తరించకుండా ఉండేందుకు కఠినమైన విధానాల్ని అనుసరిస్తామని ఆయన చెప్పటమే కాదు.. ఒకదశలో లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి బయటకు వచ్చే వారిపై కాల్పులు జరిపే అవకాశం ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. ఇలా తన మాటలతో యావత్ దేశాన్ని ఆకర్షించటమే కాదు.. తెలంగాణలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు జరుగుతుందన్న భావన కలిగించటంలో సక్సెస్ అయ్యారు.ఆరంభంలో ఎంత కట్టుదిట్టంగా వ్యవహరించారో.. ఇటీవల కాలంలో లాక్ డౌన్ సడలింపుల విషయంలో అలాంటి దూకుడే ప్రదర్శిస్తున్న వాదన వినిపిస్తోంది. సడలింపులే కాదు.. అంతర్ రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అనుమతించే విషయంలో పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే.. ఎంతో ఉదారంగా తెలంగాణ వ్యవహరిస్తోంది. ఈ సడలింపుల పుణ్యమా అని.. పాజిటివ్ కేసులు భారీగా పెరగటం గమనార్హం. ఆదివారం ఒక్కరోజునే అత్యధికంగా 199 కేసులు నమోదు కావటం తెలిసిందే.

పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులతో పాటు.. మరణాల సంఖ్య ఎక్కువ కావటం తెలంగాణ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరణాలు లేకపోవటం ఆ మధ్య వరకు ఊరటగా ఉండేది. దేశ సరాసరి కంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్న స్థాయి నుంచి.. రోజుకు మూడు.. నాలుగు మరణాలు తప్పనిసరి అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా.. సోమవారం ఒక్కరోజులోనే తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు మరణించటం గమనార్హం.

పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన వారంలో సరాసరిన వందచొప్పున కేసులు నమోదు అయ్యాయని చెప్పాలి. ఇటీవల వెలుగు చూసిన కేసులతో పోలిస్తే.. సోమవారం కాస్త తక్కువ కేసులే నమోదైనట్లు చెప్పాలి. ఎప్పటిలానే గ్రేటర్ పరిధిలో అత్యధికంగా 79 పాజిటివ్ లు నమోదైతే.. మొత్తం తెలంగాణలో 94 కేసులు నమోదయ్యాయి. ఊరట కలిగించే అంశం ఏమంటే.. సోమవారం పాజిటివ్ లలో వలసకార్మికులు ఎవరూ లేరు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం 2792 మందికి పాజిటివ్ లుగా తేలగా.. ఇప్పటివరకూ 1491 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసులు 1213. ఇప్పటివరకూ మరణాలు 88గా లెక్క తేలింది. మొత్తంగా సడలింపుల షాక్ తెలంగాణ రాష్ట్రానికి బాగానే తగిలిందన్న మాట వినిపిస్తోంది. మరి.. పాజిటివ్ ల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడో ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.