గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా?

Wed May 05 2021 06:00:02 GMT+0530 (IST)

Sitting in front of a computer for hours?

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? త్వరగా అలసిపోతున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకప్పటి పని విధానానికి ఇప్పటి పనితీరుకు చాలా మార్పులు వచ్చాయి. ఎలాంటి శ్రమ లేకుండా కూర్చొనే లక్షలు సంపాదిస్తున్నారు. కానీ గంటల తరబడి ఏసీ గదుల్లో కంప్యూటర్ ముందు కూర్చోవడం... శారీరక శ్రమ లేకపోవడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు పనిచేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు బారిన పడుతున్నారు. మరికొందరు కాసేపు కంప్యూటర్ ముందు కూర్చోగానే అలసిపోతారు. వీటన్నింటిపై జరిపిన అధ్యయనాల్లో నిపుణులు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. గంటల తరబడి కంప్యూటర్ ముందు ఒకే మాదిరిగా కూర్చుంటే స్టాటిక్ లోడింగ్ పరిస్థితికి దారి తీస్తుందని చెబుతున్నారు. కొందరిలో ఈ సమస్య అరగంట నుంచే మొదలవుతుందని అంటున్నారు.

ఎక్కువ సమయం అదే పనిగా కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ తీరు ప్రభావితమవుతుందని చెబుతున్నారు. 20శాతం రక్తప్రసరణ మందగిస్తుందని తెలిపారు. ఇంకా శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటారని వెల్లడించారు. ఇలా ఆక్సిజన్ రేటు తక్కువ అయితే త్వరగా అలసిపోతారని వివరించారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవాల్సిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పారు. అదేపనిగా కూర్చోకుండా మధ్యలో కాస్త అటూ ఇటూ తిరగాలని సూచించారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఒకే మాదిరిగా కాకుండా కూర్చోవడంలో కొంచెం మార్పులు చేసుకోవాలని వివరించారు.