‘ఫన్ బకెట్ భార్గవ్’ కేసు వార్తలపై.. సింగర్ చిన్మయి ఆగ్రహం!

Thu Apr 22 2021 17:00:02 GMT+0530 (IST)

Singer Chinmayi angry over news of Fun Bucket Bhargav case

ఫన్ బకెట్ భార్గవ్ అత్యాచారం కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. 14 ఏళ్ల అమ్మాయిని లోబరుచుకొని పలుమార్లు అత్యాచారం చేయడంతో.. ఆమె గర్భందాల్చిందని పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సింగర్ చిన్మయి స్పందించారు.ఈ సందర్భంగా ఓ వార్తా పత్రికలో వచ్చిన వార్తను కోట్ చేసిన చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ''తల్లి అతి గారాబం చేయడం.. ఎక్కడికి వెళ్తుందో గమనించకపోవడం.. అమ్మాయికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో టిక్ టాక్ భార్గవ్ తో ఆమె మరింత చనువుగా ఉండటం చేసేది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఓ మైనర్ బాలిక కామాంధుడి చేతిలో బలి కావాల్సి వచ్చింది. దీనికి తోడు తండ్రి దూరంగా ఉండడం వల్ల మంచి చెప్పేవారు ఎవరూ లేకుండా పోయారు'' అంటూ రాసిన వార్తపై తీవ్రంగా మండిపడ్డారు.

ఇలాంటివి జరిగినప్పుడు కూడా అమ్మాయిదే తప్పు అని చెప్పే సొసైటీలో మనం ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిన్మయి. ఇలాంటి విషయాల్లో అమ్మాయిని నిందించే మనస్తత్వాలు ముందుగా మారాలని చెప్పారు. అత్యాచారం జరిగితే దానికి అమ్మాయిని బాధ్యురాల్ని చేయడం ఏ మాత్రం సమంజసం కాదని అన్నారు.

అదే సమయంలో యువతులకు పలు సలహాలు ఇచ్చారు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో సరి చూసుకోవాల్సి ఉందన్నారు. ఇలాంటి వాళ్లు చాలా స్మార్ట్ గా మాటలు కలుపుతారని హెచ్చరించారు. కొందరు అమ్మాయి పేరెంట్స్ కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఇక టిక్ టాక్ వీడియోలు రీల్స్ చేయడం వంటివి తప్పుకాదన్న చిన్మియ.. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో మాత్రం చూసుకోవాలన్నారు.