Begin typing your search above and press return to search.

వాకింగ్ చేస్తున్న మన మహిళపై సింగపూర్ లో దాడి.. కారణం తెలిస్తే షాక్

By:  Tupaki Desk   |   11 May 2021 7:30 AM GMT
వాకింగ్ చేస్తున్న మన మహిళపై సింగపూర్ లో దాడి.. కారణం తెలిస్తే షాక్
X
చట్టాలు కఠినంగా అమలవుతాయని.. తప్పులు చేస్తే కఠిన దండన ఉంటుందని ప్రచారం జరిగే సింగపూర్ లో భారత సంతతి మహిళ మీద జరిగిన జాత్యాంహకార దాడి షాకింగ్ గా మారింది. నిబంధనల్నితూచా తప్పకుండా పాటిస్తున్న మహిళ మీద.. విద్వేషంతో సింగపూర్ జాతీయుడు ఒకరు దాడి చేసిన వైనాన్నిపలువురు తప్పు పడుతున్నారు. 55 ఏళ్ల భారతీయ మహిళపై సాగిన ఈ భౌతికదాడి విషయంలోకి వెళితే.. ఆమె తప్పు ఏ మాత్రం కనిపించదు. అనవసరమైన అపార్థంతోనే ఈ దాడి జరిగిందని చెప్పక తప్పదు. ఆమెపై దాడికి పాల్పడిన సందర్భంలో.. నిందితుడి దూషించిన దూషణలు వింటేనే.. అతడిలో జాత్యాహంకర పోకడలు భారీగా ఉన్నట్లు అనిపించక మానదు.

నీతా విష్ణుభాయ్ అనే 55 ఏళ్ల మహిళ ప్రైవేట్ ట్యూటర్ గా వ్యవహరిస్తుంటారు. ఆమె ఉదయాన్నే మార్నింగ్ వాక్ లో ఉన్నారు. ఆమె ముఖం మీద నుంచి మాస్కు కిందకు జారి ఉంది. ఆమె వద్దకు వచ్చిన ఒక వ్యక్తి.. ఆము ముఖం కిందకు జారిన మాస్కును ముఖం మీదకు లాక్కోవాలని కోరారు. తాను మార్నింగ్ వాక్ లో ఉన్నానని చెబుతూ.. ఆమె ముందుకు వెళ్లారు. అతడు తీవ్ర ఆగ్రహంతో ఆమెను తిడుతూ.. భౌతిక దాడికి పాల్పడ్డాడు.

అసభ్య పదజాలంతో దూషిస్తూ.. జాత్యాహంకార వ్యాఖ్యలు చేసిన వైనాన్ని బాధిత మహిళ కుమార్తె ప్రవీణ్ కౌర్ వెల్లడించారు. గుర్తు తెలియని దుండగుడు ఒకరు తన తల్లిపై దాడి చేయటంతో పాటు.. ఆమె ఛాతీపై బలంగా గుద్దటంతో తన తల్లి కింద పడిపోయిందని.. గాయాలపాలైనట్లుగా ఆమె పేర్కొన్నారు. కిందపడిన నీతాకు రక్తం కారటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దాడికి పాల్పడిన వాడు ఎవరన్న విషయాన్ని అక్కడి పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సింగపూర్ చట్టాల ప్రకారం.. దేశంలో ఆరేళ్ల వయసు దాటిన వారు ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందే. అయితే.. ఆవుట్ డోర్.. మార్నింగ్ వాక్ లతో పాటు.. వ్యాయామం చేసే వేళలో మాత్ర మాస్కులు తీసేకొచ్చు. అంతేకాదు.. కొండ ప్రాంతాలు ఎక్కేటప్పుడు కూడా మాస్కును తొలగించొచ్చు. వ్యాయామం పూర్తి చేసిన తర్వాత మాస్కును పెట్టుకోవచ్చు. ఈ లెక్కన చూసినప్పుడు భారతీయ మహిళ ఎలాంటి తప్పు చేయకున్నా.. జాత్యాంహకర ధోరణితోనే దాడి చేసిన భావన వ్యక్తమవుతోంది. ఈ ఉదంతం తర్వాత సదరు మహిళ మార్నింగ్ వాక్ కు బయటకు వెళ్లాలంటేనే భయపడుతుందని.. ఆమె కుమార్తె చెబుతున్నారు.