Begin typing your search above and press return to search.

మొదటినుండి పవన్ లో ఇదే సమస్య

By:  Tupaki Desk   |   26 Sep 2021 7:30 AM GMT
మొదటినుండి పవన్ లో ఇదే సమస్య
X
మొదటినుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఇదే సమస్య. ఇంతకీ అదేమిటంటే తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. తన స్ధాయిని లార్జర్ దాన్ ది లైఫ్ అనే స్ధాయిలో ఊహించుకోవటం పవన్ కు బాగా అలవాటు. తాజాగా ఆయన మాటలు విన్నతర్వాత అందరికీ అదే వాస్తవం అనిపిస్తోంది. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతు తన సినిమాలు ఆపేస్తే తాను లేదా సినిమావాళ్ళు భయపడిపోతామని వైసీపీ నేతలు అనుకుంటున్నారంటు ఆరోపణలు చేశారు.

తనపేరు చెప్పి మొత్తం సినిమా ఇంస్ట్రీనే చావకొడుతున్నట్లు మండిపడ్డారు. సినీపరిశ్రమక ఏపీలో జరుగుతున్న అన్యాయంపై ఇండస్ట్రీలోని పెద్దలంతా మాట్లాడాలని పిలుపిచ్చారు. ఎందుకు నోరిప్పటంలేదని సూటిగా ప్రశ్నించారు. మంత్రి పేర్నినానిని ఉద్దేశించి సన్నాసిమంత్రి అని సంబోధించారు. చిత్రపరిశ్రమకు ఉపయోగపడని సోదర భావన ఎందుకంటు నిలదీశారు. చిరంజీవంటే తనకు సోదరభావన అని పేర్నినాని అన్నమాటను పట్టుకుని మంత్రిని సన్నాసిమంత్రి అంటు రెచ్చిపోయారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మీద వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను గుర్తుచేశారు. వాళ్ళ సంపాదించిన లక్షకోట్ల రూపాయల ముందు సినీపరిశ్రమనుండి వచ్చే 2 వేల కోట్లరూపాయలు ఒకలెక్కా అంటు ప్రశ్నించారు. ఆన్ లైన్లో టికెట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాలను చూపించి అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందంటు కోపంతో ఊగిపోయారు. తాను క్రిమినల్ రాజకీయనాయకులకు భయపడేది లేదని, అన్నింటికీ తెగించే మాట్లాడుతున్నట్లు చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు పవన్ సినిమాలను ఎవరు అడ్డుకుంటున్నారు ? సినిమాలను ఆపేసి పవన్ను ఎవరు భయపెట్టారు ? పవన్ పేరుచెప్పి మొత్తం ఇండస్ట్రీని చావగొడుతున్నదెవరు ? ఇలాంటి ప్రశ్నలకు పవనే సమాధానం చెప్పాలి. టికెట్లను ఆన్ లైన్లో అమ్మాలనే విషయాన్ని తామే ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేసినట్లు చిల్లర కల్యాణ్, ఆదిశేషగిరిరావులు మీడియాతో చెప్పిన విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నారు. ఇండస్ట్రీ నుండి రిక్వెస్ట్ వచ్చిన తర్వాతే ప్రభుత్వం ఆన్ లైన్లో టికెట్ల అమ్మకంపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్నినాని చెప్పారు.

టీడీపీ అధికారంలో ఉన్నపుడు కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడిన వాళ్ళు వైసీపీ అధికారంలోకి రాగానే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే బీసీల్లోకి కాపులను చేర్చాలని ముద్రగడ పద్మనాభం ఆందోళనలు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి కాపులకు బీసీల రిజర్వేషన్లు వర్తింపచేయటం సాధ్యంకాదని స్పష్టంగా చెప్పారు. అందుకనే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడటం లేదు.

2019 ఎన్నికల ముందుకూడా ఇలాగే మాట్లాడి అబాసుపాలయ్యారు. 'జగన్ రెడ్డిని సీఎంను కానీయను, వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తాను' అంటు చాలెంజిలు విసిరారు. చివరకు ఏమైంది ? వైసీపీకి అఖండ మెజారిటి వచ్చింది. జగన్ దర్జాగా సీఎం అయిపోయారు. కానీ సీనే రివర్సయి పోటీచేసిన రెండుచోట్లా పవన్ కల్యాణే ఓడిపోయారు. జగన్ మీద పవన్ ఎగిరెగిరి పడితే పవన్ విషయంలో జగన్ మాత్రం చాలా సైలెంటుగా చేయాల్సింది చేసేశారు. అప్పటినుండి జగన్ అంటే పవన్ బాగా మండిపోతున్నారు. ఈ విషయం తాజాగా సినీఫంక్షన్లో మరోసారి బయటపడిందంతే.