తెరపైకి శ్రీకృష్ణ జన్మభూమి వివాదం.. హీట్ పెరగనుందా?

Tue Sep 29 2020 20:01:34 GMT+0530 (IST)

Shri Krishna Janmabhoomi Controversey

ఏళ్లకు ఏళ్లు.. ఆ మాటకు వస్తే దాదాపు శతాబ్దానికి పైగా సాగిన న్యాయపోరాటం ఒక కొలిక్కి రావటంతో అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. ఈ మధ్యనే ప్రధాని మోడీ స్వయంగా రామాలయానికి భూమిపూజ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా యూపీలోని శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన వివాదం ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది.గతంలో కోర్టులో ఒక కొలిక్కి వచ్చిన ఈ వ్యవహారాన్ని తాజాగా మధుర సివిల్ కోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. దీనికి స్పందించిన సదరు న్యాయస్థానం.. విచారణకు ఓకే చెప్పేయటంతో ఈ వ్యవహారం రోటీన్ కు భిన్నమైన పరిణామాలకు కారణమైందని చెప్పాలి. కోర్టు సైతం అనూహ్యంగా విచారణకు స్వీకరించటం ఇప్పుడు సంచలనమైంది. కోర్టు విచారణకు ఓకే చెప్పటమే కాదు.. ఈ నెల నుంచి కేసు విచారణ సాగుతుందని తేల్చారు.

తాజా పిటిషన్ ప్రాకరం.. వివాదాస్పద స్థలం నుంచి మసీదును తొలగించాలని.. అందులో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించేందుకు అనువుగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈ నెలాఖరు నుంచి వింటానని కోర్టు జడ్జి ఛాయశర్మ పేర్కొన్నారు. దీంతో మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చినట్లైంది. ఇదే వివాదానికి సంబంధించి 1968లో కోర్టు తీర్పును ఇచ్చింది. వాటిని కొట్టేసి.. తాజా విచారణకు అనుగుణంగా నిర్ణయాల్ని వెల్లడించాలని పేర్కొన్నారు.

తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో ఏమున్నదన్న విషయాల్ని చూస్తే..
-  పవిత్రమైన మధురా నగరిలో కత్రాకేశవ్ దేవ్ ఆలయ పరిధిలోని 13.37 ఎకరాల ప్రాంగణంలోనే శ్రీకృష్ణ జన్మభూమి జన్మస్థలం ఉంది
-  మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో 1669-70 ప్రాంతాల్లో హిందువులకు చెందిన స్థలంలో మసీదును నిర్మించారు
-  సదరు మసీదును వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలి
-  ఇదే వివాదానికి సంబంధించి 1968లో ఇదే మధుర సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాయాలి
-  1968లో కుదిరి రాజీ ఫార్ములాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు

విచారణకు ముందే వివాదాస్పంగా మారిన ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసినట్లైంది. ఇదిలా ఉంటే.. ఈ పిటిషన్ పై అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ మండిపడింది. రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేలా పిటిషన్లు వేయటం సరికాదని ఆక్షేపించింది. మత సామరస్యంతో మెలిగే మధురైలో  చిచ్చు పెట్టేందుకే ఇలాంటివి చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన వాదనను షురూ చేశారు.

1968లో పరిష్కారమైందన్న ఇష్యూను ఇప్పుడు కొట్టేసి మరోసారి విచారణ జరపాలని కోరటం చట్టవిరుద్ధమని మండిపడుతున్నారు. గతంలో పరిష్కారమైన వివాదాన్ని.. దానికి సంబంధించి ఇచ్చిన తీర్పును కొట్టేసి.. మసీదును తొలగించాలని చూడటం చట్ట విరుద్ధమన్నారు. 1991 ప్రార్థనా స్థలాల మార్పిడిని నిరోధిస్తుందని.. ఈ అంశంలో ప్రభుత్వ స్పందన చాలా కీలకమని అసద్ వ్యాఖ్యానించారు. ఈ ఇష్యూపై కేంద్రం స్పందించాలని కోరుతున్నారు. మరి.. మోడీ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.