గవర్నర్ ని కలిసిన ఫలితం.. ఎంప్లాయీస్ యూనియన్ కి షోకాజ్ నోటీస్

Mon Jan 23 2023 17:01:23 GMT+0530 (India Standard Time)

Show Cause Notice to AP Employees Union

దేశంలోనే తొలిసారిగా సర్కార్ పరువు తీసిన ఘటన ఏపీలోనే జరిగింది. దానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కారణం. దాంతో ఏపీ ప్రభుత్వ పెద్దలు అవమాన భారంతో రగిలిపోతున్నారు. నిజానికి ప్రభుత్వం మీద ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు రాజ్యాంగ రక్షకుడు గవర్నర్ కి ఫిర్యాదు చేయడం అన్నది చాలా దారుణమైన విషయంగానే చూస్తారు.ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఎపుడూ ప్రభుత్వంతో చర్చిస్తూ ఉంటారు. కుదరకపోతే ఆందోళన బాట పడతారు. అటూ ఇటూ పంతానికి పోయిన సందర్భంలో కూడా చర్చలకు ఆస్కారం ఎపుడూ ఉండేది. ఎంతో మంది ముఖ్యమంత్రులు దేశంలో వచ్చినా వారిలో కొందరు మొండిగా ఉన్నా ఉద్యోగులు ఎపుడూ వారితోనే చర్చలు జరిపి తమ డిమాండ్లు నెరవేర్చుకున్నారు తప్ప హద్దులు దాటలేదు.

మరి ఏపీలో అయితే ఏం జరిగిందో ఏమో కానీ ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా గవర్నర్ తో భేటీ కోసం రాజ్ భవన్ మెట్లు ఎక్కారు. తమ సమస్యలతో పాటు ప్రభుత్వం మీద గట్టిగానే ఫిర్యాదు చేసి వచ్చారు. ఇది ఒక విధంగా ప్రభుత్వానికి తలవంపులుగా పరిణమించింది. మరో వైపు చూస్తే సర్వీస్ నిబంధనలకు కూడా ఇది విరుద్ధం కావడంతో ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించకుండా తాను ఏమి చేయాలో చేసి చూపించింది.

అంతే ఇటీవల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమైనందుకు గానూ  రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి షోకాజ్ నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులను సైతం మీడియాలో పత్రికలలో వచ్చిన కధనాల ఆధారంగానే ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ షోకాజ్ నోటీస్ లో కీలకమైన ప్రశ్నలను సంధించారు.

ప్రభుత్వంతో జీతాలు సమస్య సహా ఆర్ధిక పరమైన అనేక అంశాల మీద మాట్లాడేందుకు సంప్రదించేందుకు అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు గవర్నర్ ని కలవాల్సి వచ్చింది అని బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు. అలాగే గవర్నర్ ని కలసి ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం అంటే అది రోసా నిబంధలనకు విరుద్ధం అని తెలియదా అని కూడా పేర్కొంది.

ఇలా రోసా నిబంధలనకు వ్యతిరేకంగా వెళ్ళిన మీ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కూడా పేర్కొంది. దీనికి సంజాయిషీని వారం రోజులలోగా ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు తమకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చట్టం ఒకటి తీసుకుని రావాలని కోరుతూ గవర్నర్ ని కలిశారు.

తమకు జీతాలు ప్రతీ నెలా టైం కి చెల్లించడంలేదని ఆర్ధిక అంశాలు అనేకం పెండింగులో పడ్డాయని కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అనేక సార్లు మాట ఇచ్చి తప్పుతోనని కూడా చెప్పడం విశేషం.  యూనియన్  ప్రెసిడెంట్ సూర్యనారాయణ ఆద్వర్యంలో ఉగ్యోగ సంఘాల ప్రతినిధులు ఈ విధంగా ఫిర్యాదు చేశారు.

ఇలా ఫిర్యాదుని ఒక ప్రభుత్వం మీద గవర్నర్ కి చేయడం అన్నది దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. దాంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కి పడడమే కాకుండా ఇపుడు సదరు యూనియన్ గుర్తింపు ని రద్దు చేసే దిశగా ఆలోచిస్తున్నరు అని అంటున్నారు. అందులో  భాగంగా షోకాజ్ నోటీస్ అని అంటున్నారు.        నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.