Begin typing your search above and press return to search.

టీడీపీ దేవుళ్లకు మొక్కులు...వైసీపీ సిట్టింగులకే సీట్లు ఇవ్వాలట...?

By:  Tupaki Desk   |   30 Jan 2023 4:00 PM GMT
టీడీపీ దేవుళ్లకు మొక్కులు...వైసీపీ సిట్టింగులకే సీట్లు ఇవ్వాలట...?
X
వైసీపీ సిట్టింగు ఎమ్మెల్యేలు అంటే డెడ్ ఈజీగా ఓడించేయవచ్చు అన్న భావన ఇపుడు ప్రధాన ప్రత్యర్ధి పార్టీ తెలుగుదేశంలో ఏర్పడింది అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్ అలా నేలబారుడుగా మారి ఏ రోజు కా రోజు దిగజారుతున్న నేపధ్యం నుంచి చూసినపుడు వారి ఆశలు అంచనాలు కరెక్ట్ అని ఎవరికైనా అనిపించకమానదు. అందుకే వారు కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారుట. వైసీపీ సిట్టింగులకే జగన్ టికెట్లు తిరిగి ఇవ్వాలని. అలా కనుక చేస్తే తాము ఇంట్లో పడుకుని అయినా గెలవగలం అని అంటున్నారుట.

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోందిట. ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎవరూ ప్రజలకు ఏమీ నేరుగా చేయలేదు. వారి పేరున ఒక్క పని కూడా చేసినట్లు వారికే కాదు ప్రజలకు కూడా గుర్తు లేదు. దాంతో పాటు వారే ఎమ్మెల్యే అభ్యర్ధులుగా మళ్లీ జనం వద్దకు వెళ్ళి ఓట్లు అడిగితే మీరు మాకేం చేశారు అంటూ మండిపోతారు అని అంటున్నారు.

అది ఇప్పటికే జరుగుతోంది. గడప గడపకు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తే జనాలు అలాగే వారిని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేగా మీరు చేసిన ఒక్క ఉపకారం ఏంటో చెప్పమని అడిగి కడిగేస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. దాంతో ఏ సర్వే అవసరం లేకుండానే వైసీపీ ఎమ్మెల్యేల మీద ఇంత వ్యతిరేకత ఉంది అన్నది తెలుగుదేశం పార్టీ బాగా గ్రహించేసింది.

వారంతా జస్ట్ డమ్మీలుగానే ఉన్నారు అని అంటున్నారు. జగన్ అయితే తాడేపల్లిలో కూర్చుని బటన్ నొక్కితే వారికి నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలలో పడుతోంది. ఆ మాత్రం సౌభాగ్యానికి ఎమ్మెల్యేలు ఉండి మీరు ఏమి చేస్తున్నారు అని జనాలు సహజంగానే అడుగుతారు కదా. అలా ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఎమ్మెల్యేలు అయిపోయారు. దాంతో వారికి కక్కలేక మింగలేక అన్నట్లుగానే బాధ ఉంది.

ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నా కూడా వీధి లైట్లు పోయాయి అన్నా వేయించలేని పరిస్థితి ఉంది. తమ ఇంటి ముందు ఉన్న రోడ్ల పరిస్థితిని కూడా చక్కదిద్దలేని దుస్థితి ఉంది. అంతే కాదు మౌలిక సదుపాయల కల్పన విషయంలో సైతం వారు ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్నారు. ఇక కాగల కార్యం అంతా వాలంటీర్లే జరిపిస్తున్నారు. రేపటి ఎన్నికల్లో వారే ఓట్లు తెచ్చే వారధులు, సారధులు అని వైసీపీ పెద్దలు భావించవచ్చు కానీ ఆ వాలంటీర్ల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.

చాలా చోట్ల వాలంటీర్లు పధకాలకు దరకాస్తులు పెట్టించాలన్నా తమను డబ్బులు అడుగుతున్నారు అని చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక సచివాలయ వ్యవస్థ కూడా హిట్ అనుకున్నా దాని మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి. అక్కడ సిబ్బంది కూడా సరైన సమాధానలు చెప్పలేరు, వారికి ప్రభుత్వం పార్టీ దాని ఫలితాలతో సంబంధం లేదు దాంతో జనాల మీద వారు విసుక్కుంటే అది నేరుగా వైసీపీ మీదనే ప్రభావం చూపిస్తోంది. మొత్తానికి చూస్తే వైసీపీ రెండిదాల చెడింది అని అంటున్నారు.

ఎమ్మెల్యేలను ఏమీ కాకుండా డమ్మీలను చేసి వాలంటీర్లను సచివాలయ వ్యవస్థను నమ్ముకుంటే అటూ ఇటూ కూడా కాకుండా పోయే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే ఓడించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ విషయంలో అధినాయకత్వం ఎలా వ్యవహరిస్తుందో తెలియదు కానీ వారే మాకు ప్రత్యర్ధులు కావాలని విచిత్రమైన కోరికను మాత్రం తెలుగుదేశం కోరుకుంటోంది. దేవుళ్లకు అలా దండాలూ పెడుతోంది. కొంపదీసి దేవుళ్ళు కరుణించి అనుకున్నట్లుగా సిట్టింగులే అభ్యర్ధులుగా వస్తే సైకిల్ దూసుకుపోవడం ఖాయమనే తమ్ముళ్ళు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.