జయప్రదను అంత మాట అని..ఇప్పుడు కవర్ చేస్తున్నాడు

Mon Apr 15 2019 13:48:48 GMT+0530 (IST)

Should I Die? Will it Satisfy You?  Jaya Prada Wants Azam Khan

ఎన్నికల వేళ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం నేతలకు మామూలే. కొన్నిసందర్భాల్లో హద్దులు దాటేలా నేతల నోటి నుంచి వచ్చే మాటలు తీవ్ర వివాదానికి కారణమవుతుంటాయి. రాంపూర్ బీజేపీ అభ్యర్థి.. సినీ నటి జయప్రదపై సమాజ్ వాదీ పార్టీ నేత అజాంఖాన్ చేసిన దురుసు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.దీంతో.. డిఫెన్స్ లో పడ్డ ఆయన డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు తెర తీశారు. ఆమెను ఉద్దేశించి తాను తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని చెప్పినా.. ఆయన అన్న మాటలపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. రాంపూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆజంఖాన్.. జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది తానేనని.. అయితే ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని గుర్తించలేకపోయానని వ్యాఖ్యానించటంపై పెను దుమారం రేగుతోంది.

ఒక మహిళా నేత గురించి ఇంత ఛండాలంగా మాట్లాడతారా? అంటూ పలువురు ఫైర్ అవుతున్నారు. మిగిలిన వేళల్లో ఇలాంటి వివాదాల్ని లైట్ తీసుకునే అలవాటున్న అజాంఖాన్.. తాజా ఎపిసోడ్ లో మాత్రం కాస్త కంగారు పడ్డారు. లెక్క తేడా వస్తే.. మొదటికే మోసం వస్తుందన్న విషయం ఆయనకు తెలుసు కదా?  అందుకే ఆయన తన మాటల్ని కవర్ చేసే పనిలో పడ్డారు.

జయప్రదను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్య చేయలేదని చెప్పటం షురూ చేశారు. రాంపూర్ నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని.. మంత్రిగా పని చేసిన తనకు ఏం మాట్లాడాలి?  ఏం మాట్లాడకూడదో తెలుసన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు పురుషులను ఉద్దేశించినవిగా ఆయన వివరణ ఇవ్వటం మొదలు పెట్టారు.

ఆయన తనతో పాటు 150 తుపాకీలు తెచ్చుకున్నాడు. అజాంఖాన్ కనిపిస్తే కాల్చేస్తాడు. ఇప్పుడాయన ఆర్ ఎస్ఎస్ ఫ్యాంటు తొడుక్కున్నాడని తేలింది. షార్టులు పురుషులే ధరిస్తారు అంటూ ఆయన మాట్లాడుతున్నారు.

యూపీలోని రాంపూర్ నుంచి జయప్రద బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా.. సమాజ్ వాదీ సీనియర్ నేత అజాంఖాన్ ఈసారి ఎంపీగా బరిలోకి దిగారు. గతంలోనూ జయప్రద మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అజాంను తాను అన్నా అని పిలిస్తే.. ఆయన మాత్రం తనను డ్యాన్సర్ అంటూ చులకనగా మాట్లాడారని జయప్రద మండిపడుతున్నారు. అనవసరంగా నోరు పారేసుకొంటున్న అజాంఖాన్ మాటలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. చూస్తుంటే.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. ఎంపీ సీటు జయప్రద చేతికి ఇచ్చేటట్టున్నాడే.