వైట్ హౌస్ ఎదుట కాల్పులు.. వెళ్లిపోయిన ట్రంప్

Tue Aug 11 2020 14:20:49 GMT+0530 (IST)

Shooting in front of the White House

అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ మీడియాలో ఉన్నారు. కాల్పుల శబ్ధం వినపడగానే సమావేశాన్ని మధ్యలోనే వదిలేసి లోపలికి వెళ్లిపోయారు.అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో మీడియా సమావేశంలో పాల్గొంటుండగా.. తుపాకీ శబ్ధం వినిపించడంతో భద్రతా సిబ్బంది రైఫిల్స్  ధరించి ట్రంప్ వద్దకు రాగా.. ఆయన అర్ధాంతరంగా విలేకరుల సమావేశం వదిలేసి లోనికి వెళ్లిపోయారు.

అధ్యక్ష భవనం ఎందుట అనుమానస్పందంగా కాల్పులు జరుపుతున్న ఓ వ్యక్తిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పులు జరిపారు. దుండగుడు మారణాయుధాలు ధరించి ఉన్నాడని వారు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఎవరో.. ఉద్దేశం ఏంటో తెలియదని ట్రంప్ తెలిపారు.

లోనికి వెళ్లిన 10 నిమిషాల తర్వాత ట్రంప్ తిరిగి వచ్చి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాల్పుల ఘటన గురించి విలేకరులకు తెలిపారు. కాల్పుల ఘటనతో భయపడ్డారా అన్న ప్రశ్నకు.. ‘ప్రపంచం ఎప్పుడూ ప్రమాదకరమైనదే.. ఈ ఘటన ఏమీ ప్రత్యేకమైనది కాదు.. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వల్ల నేను చాలా సురక్షితంగా ఉన్నాను. వారు అద్భుతమైన వ్యక్తులు. అత్యంత విశిష్టమైన సేవలందించారు’ అని దుండగుడిని కాల్చిన పోలీసులను ట్రంప్ అభినందించారు.